Russia Ukraine News: రష్యా భీకర దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. అమాయక ప్రజలు కూడా యుద్ధానికి బలవుతున్నారు. మార్చి 11న లుహాస్క్లోని నర్సింగ్‌హోంపై రష్యా సైన్యం ట్యాంకర్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 56మంది ప్రాణాలు కోల్పోయినట్లు లుహాస్క్ గవర్నర్ తెలిపారని అక్కడి మీడియా వెల్లడించింది. అంతేకాదు ఆ దాడిలో ప్రాణాలతో బయటపడిన 15మందిని రష్యా సైనికులు తమ అధీనంలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది.
మరియుపొల్‌లో ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న ఆర్ట్ స్కూల్‌పైనా రష్యా సైన్యం బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇక్కడ 400మంది తలదాచుకుంటున్నారని చెప్పారు. అయితే ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై ఎలాంటి వివరాలు తెలియవన్నారు. ఆ ప్రాంతానికి ఉక్రెయిన్ బలగాలు చేరుకోలేకపోతున్నాయని చెప్పారు. రష్యా దాడుల తర్వాత మరియుపోల్ నుంచి 39వేల మంది పారిపోయినట్లు పేర్కొన్నారు.
Russia Ukraine war death toll
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రష్యా దాడుల్లో 115మంది చిన్నారులు మరణించినట్లు ఉక్రెయిన్ మీడియా తెలిపింది. మరో 140మంది తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు ఉక్రెయిన్ సైనిక శిబిరాలు లక్ష్యంగా హైపర్సోనిక్, క్రూజ్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇంధన నిల్వలు ఉండే ప్రదేశాలపై శనివారం రాత్రి, ఆదివారం వరుస దాడులు చేసినట్లు చెప్పింది.
అయితే రష్యా బలగాలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. ఇప్పటివరకు ఆ దేశానికి చెందిన 14,700 మంది సైనికులను మట్టుబెట్టినట్లు చెప్పింది.
రష్యా దాడుల కారణంగా మార్చి 19 నాటికి ఉక్రెయిన్‌లో దాదాపు 902 మంది పౌరులు మృతి చెందారని ఐరాస మానవ హక్కుల కార్యాలయం (ఓహెచ్‌సీహెచ్‌ఆర్) ఆదివారం తెలిపింది. 1,459 మంది గాయపడ్డారని చెప్పింది. ఫిరంగులు, మల్టీపుల్ లాంచ్ రాకెట్ వ్యవస్థల ద్వారా భారీ ఎత్తున షెల్లింగ్‌తోపాటు క్షిపణి, వైమానిక దాడుల కారణంగా ఎక్కువ మంది మరణించారని వెల్లడించింది.
Ukraine NATO
నాటోలో చేరి ఉంటే పరిస్థితి మరోలా..
ఒకవేళ తాము నాటోలో చేరి ఉంటే రష్యా తమపై దండయాత్ర చేసేది కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆదివారం చెప్పారు. తమ దేశానికి భద్రత లభించేదని, వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని పెర్కొన్నారు. ఒక వేళ నాటోకు తమకు చేర్చుకోవాలనే ఆలోచన ఉంటే త్వరితగతిన ఆ దిశగా చర్యలు చేపట్టాలని, రోజూ కొన్ని వందల మంది అమాయకులు బలికాకుండా ఆపాలని పేర్కొన్నారు. నాటో దీనిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఈమేరకు అక్కడి మీడియా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడితో శాంతి చర్చలకు తాను సిద్ధమని జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ అవి విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారీ తీయవచ్చని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'పుతిన్‌తో చర్చలకు సిద్ధం.. విఫలమైతే మూడో ప్రపంచయుద్ధమే'