Russia Ukraine War: రష్యా పట్టు విడవడం లేదు. ఉక్రెయిన్ తగ్గడం లేదు. కసితో రెండు దేశాలూ రగిలిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల దాడి, బాంబుల మోత ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఉక్రెయిన్‌ను అన్నివిధాలా దిగ్బంధం చేసేందుకు రష్యా సేన ముందుకు కదులుతోంది. ప్రత్యేక చర్య(స్పెషల్ ఆపరేషన్) పేరుతో జరుపుతున్న దాడిని సమర్థించుకొంటోంది. డాన్‌బాస్ ప్రజలేమీ వీధి కుక్కలు కాదనీ, వారిని కాపాడేందుకు అనివార్యంగా ఈ చర్య చేపట్టామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. రష్యా బలగాలు తనను మట్టుబెడతాయేమోననే రీతిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తొలిసారి మాట్లాడారు. ఉక్రెయిన్ విమానాలకు ఆశ్రయమిచ్చే పొరుగుదేశాలూ యుద్ధంలో ఉన్నట్లే పరిగణిస్తామని రష్యా ఆదివారం హెచ్చరిక చేసింది. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు దాదాపు ముగింపు దశకు చేరుకుంటోంది. యుద్ధంలో కకావికలమైన లక్షల మంది ఉక్రేనియన్లు వలసదారి పడుతున్నారు.
ఆగని మోత
పౌరుల సురక్షిత తరలింపునకు వీలుగా రెండు నగరాల్లో కాల్పులను తాత్కాలికంగా పక్కనపెట్టి గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేస్తామని రష్యా ప్రకటించినా ఏ ప్రాంతంపైనా మోత ఆగట్లేదు. పైగా తీవ్రత మరింత పెరిగింది. బాంబుదాడులతో రెండోరోజూ తరలింపు ప్రక్రియకు విఘాతం కలిగింది. ఉక్రెయిన్ విద్రోహమే దీనికి కారణమని పుతిన్ మండిపడుతున్నారు. రష్యా సేనలు మేరియుపొల్, చెర్నిహైవ్‌లోని నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ శక్తిమంతమైన బాంబుల్ని గుమ్మరిస్తున్నాయి. ఖర్కివ్‌లో అణురియాక్టర్, అణు ఇంధనం ఉన్న ఒక సంస్థపైకి రాకెట్లతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. దాడుల్లో గాయపడినవారికి చికిత్స అందించడానికి వైద్యులు తమ సెల్‌ఫోన్ వెలుతురుపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ పిలుపు మేరకు పురుషులు పెద్దఎత్తున సైన్యంలో చేరుతున్నారు. ఔషధాల కొరత తలెత్తడం, మంచినీటి ఎద్దడి వంటి కారణాలతో క్షతగాత్రుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. 500 కిలోల బరువున్న (ఫాబ్-500) బాంబు సహా శక్తిమంతమైన అనేక బాంబుల్ని తమ జనావాసాలపైకి రష్యా ప్రయోగిస్తోందని చెర్నిహైవ్ ప్రాంత అధికార వర్గాలు ఆరోపించాయి. రెండు దేశాల మధ్య సోమవారం మూడో విడత చర్చలు జరిగే అవకాశాలున్నాయి.
ఆక్రమణదారులను వెళ్లగొడతాం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ 300 మంది అమెరికా చట్టసభ సభ్యులతో వీడియో కాల్‌లో దాదాపు గంటపాటు ఆయన మాట్లాడారు. జాతినుద్దేశించీ ఆయన ప్రసంగించారు. ‘‘ఆక్రమణదారులను వెళ్లగొడతాం. ఉక్రెయిన్‌లో ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. శత్రువు ప్రవేశించిన అన్ని నగరాల్లోనూ పోరాడతాం’’ అని చెప్పారు. మరో అణు ఇంధన కర్మాగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు కదులుతున్నాయని చెప్పారు. జెలెన్‌స్కీని రష్యా మట్టుబెడితే ఏం జరుగుతుందని ఒక సెనేటర్ ప్రశ్నించగా- ఒకవేళ అదే జరిగితే ఉక్రెయిన్‌కు చేయగలిగినంత సాయం చేయాలని ఆయన అమెరికాను కోరారు. బానిసత్వమా, బతుకా అనేది తేల్చుకునే పోరుగా ఈ యుద్ధాన్ని అభివర్ణించారు.
రష్యాపై ఆంక్షల్ని చర్చించిన అమెరికా
రష్యాపై ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, వాటి ప్రభావం గురించి జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. అమెరికా సాయాన్ని వేగవంతం చేయడంపై చర్చించారు. పోలండ్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో అగ్నికి ఆజ్యం పోసే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని చైనా హామీ ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్‌లతో సత్సంబంధాలున్న ఇజ్రాయెల్ కూడా ప్రస్తుత సంక్షోభానికి తెరదించే ప్రయత్నాలు చేస్తోంది. మాస్కోలో పుతిన్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ భేటీ అయ్యారు. మధ్యవర్తిత్వం వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సైనిక, మానవత సాయం కింద ఉక్రెయిన్‌కు 1000 కోట్ల డాలర్ల (సుమారు రూ.75,000 కోట్లు) ప్యాకేజి అందించాలన్న అభ్యర్థనను అమెరికా చట్టసభ పరిశీలిస్తోంది.
ప్రతినిధుల్ని ఉక్రెయిన్‌కు పంపిన పోప్
ఘర్షణను నివారించడానికి చర్చలు జరపాల్సిందిగా పుతిన్‌కు టర్కీ, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులతో పాటు పోప్ ఫ్రాన్సిస్ విజ్ఞప్తి చేశారు. తన ప్రతినిధులు ఇద్దరిని ఉక్రెయిన్‌కు పంపించారు. ఐరాస భద్రత మండలి సోమవారం మరోసారి సమావేశం కానుంది.
క్రిమియాకు'మార్గం' సుగమం!
సముద్ర మార్గంతో ఉక్రెయిన్‌కు సంబంధాలు లేకుండా చేయాలని రష్యా సేనలు చూస్తున్నాయి. మేరియుపొల్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా నేరుగా క్రిమియాతో భూ మార్గం ఏర్పాటుకు రష్యా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్ యుద్ధ విమానాలకు ఆ దేశ చుట్టుపక్కల దేశాలు ఆశ్రయం కల్పించినా, వాటిని తమతో సైనిక ఘర్షణకు పాల్పడుతున్న దేశాలుగా పరిగణిస్తామని రష్యా హెచ్చరించింది. డాన్‌బాస్‌పై ఉక్రెయిన్ అణచివేత వైఖరే యుద్ధానికి కారణమని పుతిన్ తేల్చిచెప్పారు. అక్కడి ప్రజలు వీధికుక్కలేమీ కాదని అన్నారు.
ఇదీ చూడండి: పేలుళ్లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి- పుతిన్ లక్ష్యంగా యూకే ఆరు సూత్రాల ప్లాన్