కరోనాకు మరో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది రష్యా. ఇదివరకే స్పుత్నిక్ టీకాను మార్కెట్లోకి విడుదల చేయగా.. తాజాగా.. సైబీరియాలోని వెక్టార్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన 'ఎపివాక్కరోనా' వ్యాక్సిన్‌కు అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ప్రకటించారు.
ఈ వ్యాక్సిన్‌ను 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న100 మంది వలంటీర్లపై ప్రయోగించారు. రెండు నెలల పాటు సాగిన ఈ ట్రయల్స్... రెండు వారాల క్రితం ముగిశాయి. ఈ అధ్యయన ఫలితాలను శాస్త్రవేత్తలు ఇంకా బయటికి వెల్లడించలేదు.
అయితే వ్యాక్సిన్ వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయని టీకా అభివృద్ధిలో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వైరస్ నుంచి రక్షించేందుకు అవసరమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తి ఆరు నెలల వరకు ఉంటుందని చెప్పుకొచ్చారు.
మరిన్ని ట్రయల్స్..
వ్యాక్సిన్ భద్రత, సమర్థతను అంచనా వేసే అధునాతన ట్రయల్స్‌ను నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభించనున్నారు. అప్పటివరకు ఈ టీకాను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. అడ్వాన్స్డ్ ట్రయల్స్‌లో భాగంగా 40 వేల మందిపై ప్రయోగాలు చేయనున్నట్లు రష్యా ఉప ప్రధాని టాట్యానా గొలికోవా తెలిపారు. ముందస్తు ట్రయల్స్‌లో వలంటీర్‌గా పాల్గొన్నారు టాట్యానా.
ఇవీ చదవండి