కరోనాకు కారణమైన సార్స్-కొవ్-2 సోకితే చిన్నారులు మరణిస్తారా? యువత, పిల్లలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? అంటే కాదనే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. బ్రిటన్ ప్రజారోగ్య సమాచార సమగ్ర విశ్లేషణ అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.
యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్క్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ఈ పరిశోధనల్లో పాల్గొన్నాయి. 18ఏళ్ల లోపు వారికి టీకాలు అందించాలని ఇవి సూచించాయి.
కరోనా తొలినాళ్ల నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలం వరకు బ్రిటన్లో 18ఏళ్లలోపు వారిలో 251మంది ఐసీయూలో చేరినట్టు ఓ పరిశోధన పేర్కొంది. అంటే ఆ వయస్సు వారిలోని ప్రతి 47,903మందిలో ఒకరు ఐసీయూలో చేరుతున్నట్టు వివరించింది.
చిన్నారుల్లో కరోనా కారణంగా ఉత్పన్నమయ్యే పిమ్స్-టీఎస్ అనే శ్వాస సంబంధిత వ్యాధి కారణంగా 309మంది యువత ఐసీయూలో చేరారని పరిశోధకలు వెల్లడించారు. ఇది కూడా అరుదైన విషయమేనని వివరించారు. ప్రతి 38,911మందిలో ఒకరికి ఇలా ఉంటుందని స్పష్టం చేశారు.
కరోనా వల్ల మొత్తం 25మంది చిన్నారులు, యువత మరణించారని పరిశోధనలు వెల్లడించాయి. అంటే ప్రతి 10లక్షల మందిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.
యువతకు మార్గదర్శకాలు ఇవ్వడంలో, పిల్లలకు టీకాలు అందించే విషయంలో తమ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడతాయని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- పసి పిల్లలకు కొవిడ్-19 టీకా అవసరం లేదా?