Refugees from Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. భీకర క్షిపణి, బాంబు దాడులతో దిక్కుతోచని స్థితిలోకి జారిపోయిన నిస్సహాయ పౌరులు పొట్టచేతబట్టుకొని పరాయి దేశాలకు వలసపోతున్నారు. రక్తపాతం, విధ్వంసానికి దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. యుద్ధం ఆరంభమైన 11 రోజుల్లోనే ఈ శరణార్థుల సంఖ్య 15 లక్షలు దాటిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీ స్థాయిలో వలసపోవడం ఇదే మొదటిసారని ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) ఆదివారం తెలిపింది. ఈ సంఖ్య 70 లక్షలకు చేరొచ్చని ఐరోపా సంక్షోభ నిర్వహణ విభాగం కమిషనర్ పేర్కొన్నారు. 1.8 కోట్ల మంది ఉక్రెయిన్‌వాసులపై ఈ యుద్ధ ప్రభావం పడొచ్చని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా మారొచ్చని ఐరాస హెచ్చరించింది.
ఉక్రెయిన్‌ను ఎలా వీడుతున్నారు?
- శరణార్థుల్లో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉంటున్నారు. తల్లులతో కలిసి వలసపోతున్న తమ చిన్నారుల చేతులను తండ్రులు ఆవేదనగా ముద్దాడుతూ వీడ్కోలు పలుకుతున్న సన్నివేశాలు చూపరుల కంట తడిపెట్టిస్తున్నాయి. తీవ్ర చలి, ఆకలి, దప్పికల నడుమ శరణార్థుల ప్రయాణం సాగుతోంది.
- ప్రధానంగా రైలు మార్గంలో ఉక్రెయిన్ వీడుతున్నారు. రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి, శరణార్థి శిబిరాల్లా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల పట్టాలపైనే ప్రజలు నిరీక్షిస్తున్నారు.
- రైళ్లు గంటలతరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటిలో రద్దీ విపరీతంగా ఉంటోంది. బోగీల్లోకి ప్రవేశించడానికే ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. అలసిపోయిన పిల్లలు చేస్తున్న ఆక్రందనలు గుండెలు పిండేస్తున్నాయి.
- కొన్నిచోట్ల రష్యా దళాల దాడిలో రైలు మార్గాలు దెబ్బతినడంతో శరణార్థులు ఇతర మార్గాల్లో వలస వెళుతున్నారు. కార్లు, ట్యాక్సీలు.. ఏ వాహనం దొరికితే అందులో పయనిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే.. కిలోమీటర్ల కొద్దీ నడిచిపోవడానికీ సిద్ధపడుతున్నారు. కొందరు తమకు ప్రీతిపాత్రమైన పెంపుడు జంతువులనూ వెంట తీసుకెళుతున్నారు.
- పొరుగు దేశ సరిహద్దులకు చేరే క్రమంలో చివరి 50 కిలోమీటర్ల దూరాన్ని శరణార్థులు నడిచి వెళ్లాల్సి వస్తోంది. పలు సరిహద్దు కేంద్రాల వద్ద ఆయా దేశాల అధికారులు మహిళలు, చిన్నారులకే ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల కుటుంబాలు చెదిరిపోతున్నాయి.
- ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలోనూ వలసపోతున్నారు.
ఏయే దేశాలకు వెళుతున్నారు?
ఉక్రెయిన్ వీడేవారిలో ఎక్కువ మంది పశ్చిమాన ఉన్న పోలండ్, మాల్దోవా, స్లొవేకియా, రొమేనియా, హంగరీలకు వెళుతున్నారు. ఈ దేశాలు వీరి కోసం సరిహద్దులను తెరిచాయి. కొద్దిసంఖ్యలో రష్యా, బెలారస్‌కూ తరలిపోతున్నారు. వీరిలో దాదాపు లక్ష మంది ఈ దేశాల నుంచి ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
ఆ దేశాలు వీరితో ఎలా వ్యవహరిస్తున్నాయి?
ఉక్రెయిన్ పొరుగుదేశాల సరిహద్దు కేంద్రాలు శరణార్థులతో కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. కొన్ని చోట్ల పదుల కిలోమీటర్ల మేర వలసదారులు బారులు తీరుతున్నారు. పోలండ్‌లోకి ప్రవేశించడానికి ఎముకలు కొరికే చలిలో దాదాపు 60 గంటల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. రొమేనియా సరిహద్దుల్లో 20 గంటల నిరీక్షణ తప్పడంలేదు.
- కొన్నిచోట్ల వలసదారుల పాస్‌పోర్టులు, జనన ధ్రువీకరణపత్రాలను పరిశీలించి అనుమతిస్తున్నారు. మిగతాచోట్ల వాటి కోసం ఒత్తిడి చేయడంలేదు. శరణార్థులు ఉక్రెయిన్ పౌరులు లేదా ఆ దేశంలో చట్టబద్ధంగా నివసిస్తున్న విదేశీయులై ఉండాలని చెబుతున్నారు. అయితే శరణార్థులను వెనక్కి తోసేయడం, వర్ణ వివక్ష ప్రదర్శించడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొందరు భారతీయులూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. మొత్తంమీద ఆయా దేశాలు శరణార్థులను ఆదరిస్తున్నాయి.
- ఐరోపా సంఘ (ఈయూ) సభ్య దేశాలు కొన్ని వెసులుబాట్లు ఇచ్చాయి. దీనివల్ల వీసా లేకుండానే మూడేళ్ల పాటు ఆయా దేశాల్లో నివసించేందుకు, పనిచేసుకునేందుకు శరణార్థులకు వీలు కలుగుతుంది. అయితే వీటిని ఉక్రెయిన్ జాతీయులకే ఇవ్వాలని నిర్ణయించాయి.
పోలండ్‌కు అత్యధిక సంఖ్యలో శరణార్థులు వెళ్లారు. నిత్యం దాదాపు 50వేల మంది ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నారు. గాయపడిన ఉక్రెయిన్‌వాసుల కోసం ఒక వైద్య రైలును పోలండ్ నిర్వహిస్తోంది.
ఐదు సరిహద్దు శిబిరాల గుండా హంగరీలోకి శరణార్థులు ప్రవేశిస్తున్నారు. రాజధాని బుడాపెస్ట్‌కు అరగంటకో రైలు వలసదారులతో వస్తోంది.
బెర్లిన్ స్టేషన్‌లో వాలంటీర్లు.. శరణార్థులకు అరటిపళ్లు, బ్రెడ్ రోల్స్, వాటర్ బాటిళ్లు ఇస్తున్నారు. హంగరీ సరిహద్దు పాయింట్ల వద్ద వేడివేడి టీ, కాఫీ, పిజ్జాలు అందిస్తున్నారు. వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పువ్వులనూ ఇస్తున్నారు. హంగరీ, రొమేనియాలు ఆహారం, దుస్తుల కోసం నగదు కూడా ఇస్తున్నాయి. శరణార్థుల పిల్లలను స్థానిక పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి.
అంతర్గత నిర్వాసితులూ ఎక్కువే..
ఉక్రెయిన్‌లో యుద్ధం వల్ల గూడు చెదిరి, స్వదేశంలోనే ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నవారూ ఎక్కువగానే ఉన్నారు. యూఎన్‌హెచ్‌సీఆర్ అంచనా ప్రకారం వీరి సంఖ్య 1.6 లక్షల మేర ఉండొచ్చు. భీకర పోరు నడుమ వీరికి సాయం చేయడం సహాయ సిబ్బందికి కష్టమవుతోందని సంస్థ తెలిపింది.
- శరణార్థులు తమ దేశంలో కొనసాగేందుకు ప్రత్యేక వీసాను చెక్ రిపబ్లిక్ ప్రవేశపెట్టింది.
ఇదీ చదవండి: ఆగని బాంబుల మోత.. ఉక్రెయిన్‌ను కమ్మేస్తున్న రష్యా సేనలు