చిన్న ద్వీపాల్లో మౌలికవసతులు పెంపొందించేందుకు ఐరిస్(ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రిసీలియంట్ ఐలాండ్ స్టేట్స్)ను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వాతావరణ మార్పుతో ఆయా దేశాలు ప్రమాదంలో పడ్డాయని, అక్కడి ప్రజల్లో ఐరిస్ కొత్త ఆశలు, నమ్మకాన్ని నింపుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గ్లాస్గోలో జరుగుతున్న వాతావరణ సదస్సులో భాగంగా ఐరిస్ను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పు ప్రభావం ఎవరినీ విడిచిపెట్టడం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న ద్వీపాలపై ఈ ప్రభావం మరింత దారుణంగా ఉందన్నారు.
"ఐరిస్.. నూతన ఆశలు, నమ్మకాన్ని కలిగిస్తుంది. వాతావరణ మార్పుతో అత్యంత దారుణంగా దెబ్బతిన్న దేశాలకు సాయం చేసేందుకు ఐరిస్ ఉపయోగపడుతుంది. వాస్తవానికి వాతావరణ మార్పులతో గత దశాబ్ద కాలంగా ప్రతి ఒక్కరు ప్రభావితమవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు, సహజసిద్ధ వనరులున్న దేశాలూ ముప్పు బారినపడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది మనం అందరం చేసుకున్నదే. అందువల్ల మానవజాతి మనుగడకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్న ద్వీపాలపై వాతావరణ మార్పు ప్రభావం దారుణంగా ఉంది. వీరికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అండగా నిలుస్తుంది. ప్రకృతి విపత్తులకు సంబంధించిన డేటాను ఆయా ద్వీపాలతో ఇస్రో పంచుకుంటుంది."
-- నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి.
ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- '2070 నాటికి కర్బన ఉద్గారాల రహితంగా భారత్'