డిజిటల్ సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్న విద్యార్థులు.. చదువుల్లో తక్కువ శ్రద్ద కనబరుస్తారని ఓ అధ్యయనంలో తేలింది. పరీక్షలంటే వీరు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని.. ఒంటరిగా ఉంటూ ఫోన్లతోనే సమయం గడిపే వారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కవగా ఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది.
బ్రిటన్‌లో ఆరోగ్య సంబంధిత డిగ్రీ కోర్సుల్లో చేరిన 285 మంది విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగ విధానాలు, వారి ప్రవర్తన, ఒంటరితనం, చదువులో నైపుణ్యాలు వంటి అంశాలపై అధ్యయనం చేసి విశ్లేషించారు. బ్రిటన్‌లోని స్వాన్సీ విశ్వవిద్యాలయంతో సహా కొంత మంది అధ్యయనకర్తలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వచ్చిన ఫలితాలను జర్నల్ ఆఫ్ అసోసియేటెడ్ కంప్యూటర్ లెర్నింగ్ మేగజీన్‌లో ప్రచురించారు. అంతర్జాల వ్యసనం.. చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ పరిశోధనలో తేలింది.
నాలుగు గంటలు ఆన్లైన్లోనే
ప్రతి నలుగురిలో ఒక విద్యార్థి రోజుకు సుమారు 4గంటలపాటు ఆన్లైన్లో గడుపుతున్నాడు. మిగిలిన వారు ఒకటి నుంచి 3 గంటల పాటు అంతర్జాలం కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది సామాజిక మాధ్యమాల కోసం ఇంటర్నెట్ వినియోగిస్తే..30 శాతం మంది కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వాడుతున్నారు.
అంతర్జాల వ్యసనం కారణంగా నియంత్రణ కోల్పోవడం, ప్రణాళిక రూపకల్పన వంటి సామర్థ్యాలు బలహీనపడతాయని.. వీటిలో సరైన సామర్థ్యం లేకపోతే చదవడం కష్టతరం అవుతుందని అధ్యయనకర్తలు వెల్లడించారు.
విద్యావ్యవస్థలో డిజిటలైజేషన్‌ను కొనసాగించే ముందు.. 'నిజంగా ఇది మనకు మంచి ఫలితాలను తీసుకురానుందా?' అని ఒక్కసారి ఆలోచించుకోవాలని నిపుణులు సూచించారు. ఈ ప్రణాళిక కొన్ని అవకాశాలను అందించినా కానీ.. అసలు అంచనా వేయలేని నష్టాలనూ తీసుకొస్తుందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్‌పై పోరు కోసం బాహుబలి 'తాబేలు'!