కరోనా వ్యాక్సిన్‌ను చిన్నపిల్లలపై తొలిసారి పరీక్షించేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సిద్ధమవుతోంది. చిన్నారులపై తమ టీకా ఎంత సమర్థంగా పనిచేస్తుందో అంచనా వేయనుంది. ఇందుకోసం 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 300మంది పిల్లలను వలంటీర్లుగా ఎంచుకుంది. వారిలో 240 మందికి టీకా ఇచ్చి.. వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేయనున్నట్లు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వెల్లడించింది. ఇప్పటివరకు పిల్లలు ఎక్కువగా కొవిడ్ బారినపడనప్పటికీ.. వారిలో కరోనా రోగనిరోధక ప్రతిస్పందనను స్థాపించడం ముఖ్యమని పేర్కొంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాను 18ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సున్న వారికే ఇస్తున్నారు. కొవిడ్ టీకాను చిన్నపిల్లలకు పంపిణీ చేసేందుకు ఫార్మా దిగ్గజ సంస్థలు ఫైజర్, మోడెర్నా ఇప్పటికే క్లినికల్ పరీక్షలు ప్రారంభించాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కూడా చిన్నారులకు టీకా అందించేందుకు క్లినికల్ పరీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి : ఇటలీ తదుపరి ప్రధానిగా 'మారియో ద్రాగి'!