కరోనా వైరస్‌కు టీకా విషయంలో కొన్ని సానుకూల పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఆక్స్‌ఫర్డ్ తయారు చేస్తున్న టీకా రెండోదశలో భాగంగా విస్తృత ప్రయోగాలకు.. అభ్యర్థుల ఎంపిక మొదలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. తొలిదశలో 1,000 మందికి ఇమ్యూనైజేషన్ చేసినట్లు పేర్కొంది. వారి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.
రెండో దశలో 10,260 మందిపై దీనిని ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వీరిలో 56 ఏళ్లు పైబడిన వారు, 5-12ఏళ్ల మధ్య వారు కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది పూర్తయితే మూడో దశ కూడా మొదలుపెట్టనున్నట్లు ఆక్స్‌ఫర్డ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. దీనిలో 18ఏళ్లు పైబడిన వారిపై ప్రయోగించి ఎలా పనిచేస్తోందో తెలుసుకుంటారు.
ఏమిటీ ఆక్స్‌ఫర్డ్ టీకా..?
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ChAdOx1 nCoV-19 పేరుతో టీకాను అభివృద్ధి చేసింది. దీనిలో వినియోగించిన అడినో వైరస్‌ను చింపాజీల నుంచి సేకరించారు. వీటిలో జన్యుపరమైన మార్పులు చేసి సార్స్ కోవ్2లో ఉండే స్పైక్ ప్రొటీన్ వంటిదానిని ఏర్పాటు చేశారు. ఈ వైరస్ శరీరంలోకి వెళ్లాక నకళ్లను సృష్టించి వ్యాపించదు. దీనిని చూసి శరీరం.. రోగనిరోధక శక్తిని తయారు చేసుకొనేలా ప్రేరేపిస్తుంది.
ఈ టీకాను తీసుకొన్న ఆరు రీసెస్(ఆసియా జాతి) కోతులు వైరస్‌ను నిలువరించాయి. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు 'న్యూయార్క్ టైమ్స్' పేర్కొంది. దీంతో ఈ టీకా నమ్మకమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే మనుషులపై మొదటి దశ టీకా ప్రయోగాలు పూర్తయ్యాయి. వీటిలో అవి మనుషలపై చూపించే ప్రభావాన్ని అంచనావేస్తున్నారు.
రెండు, మూడో దశలే కీలకం..
ఈ ప్రయోగాల్లో రెండు, మూడో దశలే కీలకం. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వారిలో కొందరికే కరోనావైరస్ కోసం చేసిన ChAdOx1 nCoV-19 టీకా ఇస్తారు. మిగిలిన వారికి MenACWY అనే టీకా ఇస్తారు. ఎవరికి ఏ టీకా ఇచ్చింది తెలియకుండా గోప్యంగా ఉంచుతారు.
MenACWY అంటే ఏమిటీ..?
ఒక రకమైన మెనుంజైటీస్‌కు కారణమయ్యే ఏ, సీ, డబ్ల్యూ, వై, అనే బాక్టిరియా ఇన్ఫెక్షన్లకు కారణం కాకుండా బ్రిటన్‌లో వాడే టీకా ఇది. 2015 నుంచి అక్కడ వినియోగిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకా చేయించుకొంటే కొంచెం వాపు, జ్వరం వంటివి వస్తున్నాయి. MenACWY చేయించుకొన్నా అలాంటి లక్షణాలే ఉంటాయి. ఈ ప్రయోగంలో ఎవరికి ఏ టీకా చేశారో తెలియకుండా ఇద్దరిలో ఒకే లక్షణాలు చూపించేలా ఉండేందుకు MenACWYను ఎంపిక చేశారు. అదే సెలైన్ నీరు ఎక్కిస్తే వారిలో ఎటువంటి వాపు, జ్వరం రాదు. అప్పుడు వారికి ఆక్స్‌ఫర్డ్ టీకా చేయలేదని తేలిపోతుంది.
ఈ ప్రయోగాల్లో ఏం పరీక్షిస్తారు..?
కొవిడ్-19కు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో అంచనావేస్తారు. అదే సమయంలో ప్రమాదకరమైన సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని నిరూపించాలి. మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. వీరు టీకా వేయించుకొన్న ఏడు రోజులపాటు తమ లక్షణాలను నమోదు చేయాలి. వీరిలో కొంత మందిని కొవిడ్ నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపమని చెబుతారు. ఈ నమూనాలు సేకరించిన వారిలో కొవిడ్ లక్షణాలు ఏమైనా కనిపించాయేమో పరీక్షిస్తారు. వారి ఇమ్యూనిటీ ఎలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
పరీక్షలు ఎప్పుడు పూర్తవుతాయి..
ఈ టీకా ప్రయోగాల్లో పాల్గొన్న కొందరిలో కొవిడ్ లక్షణాలు కనబడితే ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉంటే వెంటనే ఎక్కువ మందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు లక్షణాలు కనిపించిన వారు ఆక్స్‌ఫర్డ్ టీకా తీసుకొన్నారా..? MenACWY టీకా తీసుకొన్నారా విశ్లేషిస్తారు. ఆక్స్‌ఫర్డ్ టీకా తీసుకొన్న వారిలో సానుకూల ఫలితాలను బట్టి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. అందుకే ఈ ప్రయోగానికి కొవిడ్ బారిన పడే అవకాశం ఉన్న చోట్ల విధులు నిర్వహిస్తున్న వారినే ఎంపిక చేసుకొన్నారు. వీరిలో వైద్య సిబ్బంది, ఇతర కీలక విభాగాల్లో పనిచేసే వారు ఉన్నారు.