విశ్వమానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు టీకాను కనుగొనే పనిలో వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు. లండన్‌కు చెందిన ప్రముఖ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ వ్యాక్సిన్ తయారు చేసినట్లు తెలిపారు. అయితే ఆ టీకా కరోనాపై సమర్థంగా పని చేస్తుందో? లేదో? పరిశీలించడానికి ముందే.. సెప్టెంబరు నాటికి 10 లక్షల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు.
సమర్థంగా పని చేస్తుందనే..
'సీహెచ్ఏడీఓఎక్స్1 కొవిడ్-19' పేరుతో పిలిచే ఈ వ్యాక్సిన్.. కరోనాపై సమర్థంగా పని చేస్తుందని.. టీకా అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రొపెసర్ సరహ్ గిల్బర్ట్, ఆమె బృందం విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వయసు వారినే..
'సీహెచ్ఏడీఓఎక్స్1 కొవిడ్-19' టీకా.. కరోనాను నిరోధించగలదా?లేదా? అని పరీక్షించడానికి ఎదురుచూస్తునట్లు పరిశోధకులు తెలిపారు. ఇందుకుగానూ 18నుంచి 55 ఏళ్ల వయసు మధ్య గల 500మందినిపైగా ఎంపిక చేసి, వారికి స్కీనింగ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వారు అర్హత సాధించినట్లయితే, టీకాను వారిపై ప్రయోగిస్తారు. అయితే వెంటనే కాకుండా కొన్నివారాల వరకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే జరిగితే.. మానవులపై పరీక్షించిన మొదట టీకా అవుతుందని చెప్పారు పరిశోధకులు.
500 మందికి పైగా..
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని జెన్నర్ ఇన్స్టిట్యూట్, టీకా పరిశోధన బృందం కలిసి.. 510మందిని వలంటీర్లను సమీకరించి, వారిపై 'సీహెచ్ఏడీఓఎక్స్1 కొవిడ్-19'వ్యాక్సిన్‌ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ పరీక్షకు యూకేలోని నైతిక సమీక్ష విభాగం నుంచి అనుమతి లభించిందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ పరీక్షలో పాల్గొనవచ్చని పరిశోధకులు వారి అధికారిక వెబ్సైట్ లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా కనిపెడుతుంది: ట్రంప్