సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నోవావ్యాక్స్ భాగస్వామ్యంతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న మలేరియా టీకా ప్రయోగ పరీక్షల్లో మునుపెన్నడూ లేని అద్భుత ఫలితాలు నమోదుచేసినట్లు పరిశోధకులు ప్రకటించారు. టీకా ఫేజ్-2బి ప్రయోగ పరీక్షల వివరాల్ని శుక్రవారం వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన 75% సమర్థతను ఇది అందుకున్నట్లేనని తెలిపారు. ఆర్21/మ్యాట్రిక్స్-ఎం పేరుతో అభివృద్ధిచేస్తున్న ఈ టీకా 12 నెలల పరీక్షా కాలంలో 77 శాతం సమర్థతను చాటినట్లు చెప్పారు. ఎక్కడా ఎలాంటి దుష్ఫలితాలు వెలువడలేదన్నారు.
"మా ప్రయోగాల్లో ఉత్తేజకరమైన ఫలితాలు వచ్చాయి. అపూర్వ సమర్థత స్థాయిల్ని ఈ టీకా చాటింది" అని యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రయోగ పరీక్షల ముఖ్య అధికారి హలిదౌ టింటో తెలిపారు. టీకా మూడోదశ ప్రయోగ పరీక్షలకు ముందుకు వచ్చేవారిని గుర్తించేపనిని ఇప్పుడు ప్రారంభించారు. ఆఫ్రికాలోని నాలుగు దేశాల్లో 5 నుంచి 36 నెలల మధ్య వయసుకలిగిన 4800 మంది పిల్లలపై పరీక్షలు నిర్వహించి ఇది ఎంత సురక్షితమైనది అన్న దానిని పరీక్షిస్తారు. ఈ ఫలితాలు తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అదర్ పూనావాలా చెప్పారు. ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాక టీకాను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు.
ఇదీ చదవండి:రెమ్‌డెసివిర్ ఉత్పత్తి పెంచే దిశగా కేంద్రం చర్యలు