Omicron hospitalisation: డెల్టా వేరియంట్ సోకినవారితో పోల్చితే ఒమిక్రాన్ నిర్ధరణ అయినవారు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం తక్కువగా ఉంటుందని తాజాగా బ్రిటన్‌లో చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్‌ఎస్‌ఏ) గతేడాది నవంబర్ 22- డిసెంబర్ 26 మధ్య ఇంగ్లాండ్‌లో నమోదైన 5.28 లక్షలకుపైగా ఒమిక్రాన్ కేసులు, 5.73 లక్షల డెల్టా కేసులను విశ్లేషించి దీన్ని రూపొందించింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో మూడింట కేవలం ఒక వంతు వారికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావొచ్చని పేర్కొంది. కొత్త వేరియంట్‌తో తీవ్ర అనారోగ్యం, హాస్పిటలైజేషన్ ముప్పు తక్కువేనంటూ ఇదివరకు వచ్చిన ఇతర అధ్యయనాలు, శాస్త్రవేత్తల వాదనలను తాజా అధ్యయనం మరింత బలోపేతం చేసినట్లయింది.
Vaccines on omicron: ఒమిక్రాన్ కట్టడిలో టీకాలు బాగా పనిచేస్తాయని కూడా యూకేహెచ్‌ఏఎస్ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం.. ఏ టీకా తీసుకోని వారితో పోలిస్తే రెండు డోసులు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ సోకితే ఆసుపత్రిలో చేరే అవకాశాలు 65 శాతం తక్కువ. అదే, బూస్టర్ డోస్ తీసుకున్నవారికి 81 శాతం తక్కువ. అయితే, ఈ అంశాలపై ఇప్పుడే ఒక నిర్ధరణకు రావడం తొందరపాటు చర్య అవుతుందని యూకేఎస్‌హెచ్‌ఏలోని చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ అన్నారు. ఒమిక్రాన్ ఉద్ధృత వ్యాప్తి, ఇంగ్లాండ్‌లో 60 ఏళ్లు పైబడినవారిలో పెరుగుతున్న కేసుల కారణంగా రాబోయే వారాల్లో యూకే నేషనల్ హెల్త్ సర్వీస్‌పై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చూడండి: 'ఫ్లొరోనా' పేరుతో కొత్త వ్యాధి- ఆ దేశంలో తొలి కేసు నమోదు
ఇదీ చూడండి: అమెరికాలో 'కొవిడ్' ఉప్పెన.. ఒక్కరోజులో 5.6లక్షల కేసులు