పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ రిమాండ్‌ను సెప్టెంబర్ 19 వరకు పొడిగిస్తూ వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో వీడియో లింక్ ద్వారా బ్రిటన్ కోర్టు విచారణకు హాజరయ్యారు నీరవ్ మోదీ. ఈ మేరకు విచారించిన కోర్టు సెప్టెంబర్ 19న తదుపరి విచారణకు సంబంధించిన తేదీలు ఖరారు చేసే అవకాశముందని తెలిపింది.
మార్చి19న నీరవ్ మోదీని అరెస్టు చేసిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు.
ఏప్రిల్ 8 నాటికి ఆధారాలు...
నీరవ్‌ని భారత్‌కు అప్పగించే అంశంపై 2020 మే 11 నుంచి ఐదు రోజులు విచారణ జరపాలని ఇప్పటికే కోర్టు తాత్కాలికంగా తేదీలు నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నాటికి నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమకు అందుతాయని.. ఆ తర్వాత భారత్‌కు అప్పగించే అంశంపై విచారణ జరుగుతుందని వెస్ట్‌మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.
ఈ కేసులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి నీరవ్ మోదీ పలుసార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలను కోర్టు కొట్టివేసింది.
ఇదీ చూడండి: సోమవారం వరకు సీబీఐ కస్టడీలో చిదంబరం