చిన్నపాటి దగ్గు, తుమ్ము వచ్చినా బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు. ఇక జ్వరం, జలుబు వచ్చి, వాసన గుర్తించే శక్తి కోల్పోతే.. కరోనా భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీజనల్ వ్యాధులకు, కరోనా వైరస్కు ఒకే రకమైన లక్షణాలుండటం ఇందుకు ప్రధాన కారణం. ఈ సమయంలో ప్రజలకు ఊరట కలిగిస్తూ.. సాధారణ జలుబు వల్ల వాసన సామర్థ్యాన్ని కోల్పోవడానికి.. కరోనా వైరస్ లక్షణాలకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించింది ఐరోపాకు చెందిన ఓ నిపుణుల బృందం.
"కంపేరింగ్ కొవిడ్-19 అండ్ కామన్ కోల్డ్ కీమోసెన్సరీ డిస్ఫంక్షన్" పేరుతో ఉన్న ఈ అధ్యయనం రినోలజీ జర్నల్లో ప్రచురితమైంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కరోనా బాధితులు.. ఏ విధంగా వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోతారనే అంశాన్ని ఇతరుల పరిస్థితితో పోల్చి చూశారు వాసన రుగ్మత నిపుణులు.
కరోనా బాధితుల్లో వాసన చూసే శక్తి పోయినప్పటికీ... వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు. ముక్కు కారడం కూడా ఉండదు. తీపి, చేదు రుచిని గుర్తించలేరు. ఇదే వారు కనుగొన్న ముఖ్య వ్యత్యాసం. మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్న పలు అధ్యయనాలకు ఈ పరిశోధన ఊతమందిస్తోంది. దీంతో.. రుచి, వాసన లక్షణాల ఆధారంగా కరోనా పరీక్షల నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధక బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
పరిశోధన కోసం 10 మంది కరోనా బాధితులు, జలుబుతో తీవ్రంగా సతమతమవుతున్న 10 మంది, 10 మంది ఆరోగ్యవంతులపై పరీక్షలు నిర్వహించారు.
"వాసన కోల్పోయే లక్షణం కరోనా బాధితుల్లో ఎక్కువగా ఉన్నట్టు మేము గుర్తించాం. వాసనను గుర్తుపట్టడంలో బాధితులు చాలా కష్టపడ్డారు. ఇదే వీరికీ.. జలుబుతో ఉన్న వారికీ మధ్య ఉన్న అతిపెద్ద వ్యాత్యాసం. కరోనా బాధితులు- జలుబు, ఫ్లూతో బాధపడుతున్న వారిని వేరు చేయడానికి.. రుచి, వాసన లక్షణాల ఆధారంగా పరీక్షలు నిర్వహించవచ్చు."
--- ఫిల్పొట్, పరిశోధకులు
ఇదీ చూడండి:- టాయిలెట్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే...