కొవిడ్-19 కారక కరోనా వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థలు స్పందిస్తున్న తీరులో స్త్రీ, పురుషుల మధ్య వైరుధ్యాలు ఉంటున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అంశం ఆధారంగా కొత్త ఔషధాలకు లక్ష్యాలను కనుగొనవచ్చని వారు పేర్కొన్నారు. యేల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
తీవ్రస్థాయి కొవిడ్, మరణం ముప్పు ఎక్కువగా ఉండే పురుష రోగుల్లో జీవక్రియకు సంబంధించిన ఒక చర్యాక్రమం.. రోగనిరోధక ప్రతిస్పందనకు అనుగుణంగా ఉంటోందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్ సోకిన స్త్రీలతో పోలిస్తే ఈ మహమ్మారి బారిన పడ్డ పురుషుల్లో కైను రెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఇది అమినో ఆమ్ల జీవక్రియకు సంబంధించింది. స్కిజోఫ్రినియా, హెచ్ఐవీ సంబంధిత వ్యాధులు వంటివి ఉన్నవారిలోనూ ఈ ఆమ్లం స్థాయి అధికంగా ఉంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.
తీవ్రస్థాయి కొవిడ్ బారిన పడిన పురుషుల్లో కైనురైన్తో పోలిస్తే కైనురెనిక్ ఆమ్ల నిష్పత్తి ఎక్కువగా ఉంటున్నట్లు తేలింది. కైనురెనైన్ అనేది ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ద్వారా ఉత్పత్తవుతుంది. ఇది నియాసిన్ అనే పోషక పదార్థాన్ని తయారుచేయడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆమ్లంపై మరిన్ని పరిశోధనలు జరపడం ద్వారా వ్యక్తిలోని రోగనిరోధక స్థాయి కరోనా వైరస్‌కు ఎలా స్పందిస్తున్నది గుర్తించొచ్చు. తద్వారా చికిత్స మార్గాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి:Delta variant: కొవిడ్ కంటే 1000 రెట్లు వైరల్ లోడ్