భారీగా కురుస్తోన్న మంచుతో స్పెయిన్ తడిసి ముద్దవుతోంది. మంచు దుప్పటి కప్పుకొని శ్వేతవర్ణ శోభితంగా కనులవిందు చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు 50 సెంటీమీటర్ల మేర హిమపాతంతో రాజధాని మాడ్రిడ్తో పాటు దేశం మొత్తం మంచులో మునిగిపోయింది. అత్యవసర బృందాలను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 500 రహదారులపై మంచు తొలగించారు. వాహనాల్లో చిక్కుకుపోయిన సుమారు 1,500 మందిని రక్షించారు.
150 హెలికాప్టర్లు..
రోడ్లన్ని మంచుతో నిండిపోయిన క్రమంలో 150 అత్యవసర సేవల హెలికాప్టర్లను మోహరించారు. హిమపాతం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది ప్రభుత్వం. ఉష్ణోగ్రతలు -14 డిగ్రీలకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. టెర్యూల్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
భారీగా కురుస్తోన్న మంచుతో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.