Luminarias festival in Spain: భోగి మంటల తరహాలో అగ్నిజ్వాలలు రగిలించి.. అందులో నుంచి అశ్వాలను దూకించి పవిత్రం చేసే పండగను స్పెయిన్‌లోని ఒక చిన్న పట్టణంలో ఏటా నిర్వహిస్తారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు పశ్చిమాన ఉండే శాన్ బార్టోలోమ్ డి పినారెస్ అనే పట్టణంలో.. ప్రతి ఏటా జనవరి 16న ఈ ఫెస్టివల్ జరుపుతారు. వెలుగుల పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవాల్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గతేడాది కరోనా ఉద్ధృతి కారణంగా ఈ పండగను రద్దు చేశారు. ఈసారి ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.
శతాబ్దాలుగా వెలుగుల పండగను స్థానికులు జరుపుకుంటున్నారు. పొగ ద్వారా వ్యాధుల్ని దూరం చేయవచ్చనే ప్రాచీన కేథలిక్ సంప్రదాయం నుంచి ఈ పండగ వచ్చిందనేది కొందరి అభిప్రాయం. ఇలా అశ్వాలను మంటల్లో నుంచి దూకిస్తే అవి పవిత్రమవుతాయని వారి నమ్మకం. తద్వారా వాటి ఆయుష్షు పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే భారీ సంఖ్యలో గుర్రాలను తీసుకొచ్చి మంటల్లో నుంచి పరుగులు తీయిస్తుంటారు.
వెలుగుల పండగలో అశ్వాలు గాయపడకుండా, మంటలు అంటుకోకుండా స్థానికులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అశ్వం శరీరంపై వెంట్రుకలు దెబ్బతినకుండా వాటిని ఒక బ్రష్‌తో శుభ్రంగా తుడుస్తారు. అలాగే తోకకు మంటలు అంటుకోకుండా జడలా అల్లుతారు. అలా అల్లిన తోకను మడిచి ప్లాస్టిక్ లేదా వస్త్రంతో.. జాగ్రత్తగా పైకి కడతారు. ఇలా చేయడం వల్ల తోకతో పాటు అశ్వం శరీరానికి ఎలాంటి గాయాలుకావని చెబుతున్నారు.
తమ జంతువులపై ప్రేమతో స్థానికులు ఏటా ఈ పండగను జరుపుకుంటారని శాన్ బార్టోలోమ్ మేయర్ అన గోమెజ్ వెల్లడించారు. జంతు ప్రేమికులు, మూగజీవాల సంరక్షణ కోసం పోరాడే సంస్థలు ఈ సంప్రదాయంపై ఫిర్యాదులు చేస్తున్నాయి. స్థానికులు మాత్రం వెలుగుల పండగ వల్ల అశ్వాలకు ఎలాంటి అపాయం వాటిల్లదని చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఇవేం చోరీలు బాబోయ్.. పార్శిల్ రైళ్లనే దోచేస్తున్నారు!