లండన్‌కు చెందిన ఓ హెచ్ఐవీ రోగి 'మూల కణ మార్పిడి' ( స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స తరువాత పూర్తిగా కోలుకున్నట్లు కేంబ్రిడ్జ్ వైద్యులు తెలిపారు. ఇలా హెచ్ఐవీ నుంచి ఓ వ్యక్తి పూర్తిగా కోలుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకు ముందు 2011లో అమెరికన్ తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి మొదటిసారిగా ఈ వైరస్ నుంచి బయటపడ్డాడు. అతడ్నే 'బెర్లిన్ రోగి' అని కూడా అనేవారు.
క్యాన్సర్‌కి చికిత్స చేస్తే...
లండన్ రోగిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ల ఆడమ్ కాస్టిల్లెజో నిజానికి వెనుజువెలాకు చెందిన వాడు. 2003లో అతనికి హెచ్ఐవీ సోకినట్లు కేంబ్రిడ్జ్ పరిశోధకులు గుర్తించారు. తరువాత 2012 వరకు అతనికి మందులు అందిస్తూ ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. ఆ మరుసటి ఏడాదే ఆడమ్‌కు ప్రాణాంతకమైన 'హాడ్కిన్స్ లింఫోమా' అనే 'రక్త క్యాన్సర్' వచ్చినట్లు వైద్యులు గుర్తించారు.
2016లో క్యాన్సర్‌ను నయం చేయడానికి ఆడమ్‌కు మూలకణ మార్పిడి (ఎముక మజ్జ మార్పిడి) చికిత్స చేశారు వైద్యులు. ఫలితంగా అతనిలో జన్యు పరివర్తన జరిగి, క్యాన్సర్‌తో సహా హెచ్ఐవీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. 30 నెలల తరువాత చేసిన పరీక్షల్లో.. అతనిలో హెచ్ఐవీ వైరస్ జాడ పూర్తిగా లేకపోవడాన్ని వైద్యులు గుర్తించారు.
అధ్యయనం ప్రకారం..
రవీంద్ర గుప్తా 'ది లాన్సెట్ హెచ్ఐవీ'లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. మూలకణ మార్పిడి చికిత్సతో రోగి పూర్తిగా హెచ్ఐవీ నుంచి కోలుకున్నాడని ఆయన స్పష్టం చేశాడు. తాము హెచ్ఐవీ వైరస్ దాక్కొవడానికి వీలు కల్పించే కణాలన్నింటినీ పరిశీలించామన్నారు. అయితే అవి హెచ్ఐవీకి ప్రతికూలంగా పనిచేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.
"పరీక్షల్లో హెచ్ఐవీ 'శిలాజాలు' (ఫాసిల్స్) కనుగొన్నాం. అయితే ఇవి పునరుత్పత్తి చేయలేకపోతున్నాయి. అదే మేము కూడా ఆశించాం. శరీరంలోని అన్ని కణాలకు వ్యాపించే ఈ వైరస్.. పూర్తిగా నాశనం కావడం ఊహకు కూడా అందని విషయం."- రవీంద్ర గుప్తా, అధ్యయన కర్త
అందరికీ వర్తించదు..
ఆడమ్ కాస్టిల్లెజోకు మూలకణ మార్పిడి చికిత్స ద్వారా హెచ్ఐవీ నయం అయినంత మాత్రాన ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని చెప్పలేమని కేంబ్రిడ్జ్ పరిశోధకులు స్పష్టం చేశారు. అనేక మంది ఇతర రోగులకు ఇదే చికిత్స అందించినా వారు అంతగా కోలుకోలేదని తెలిపారు. అయితే హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణకు ఈ మూలకణ మార్పిడి చికిత్స అందించవచ్చా? లేదా? అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్లు వారు తెలిపారు.
ప్రస్తుతం ఏటా దాదాపు 10 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణిస్తున్నారు.
ఇదీ చూడండి: మధ్యప్రదేశ్‌లో రిసార్ట్ రాజకీయం- అజ్ఞాతంలో ఎమ్మెల్యేలు