వాతావరణ మార్పులతో తలెత్తుతున్న ప్రమాదకర పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నివేదిక విడుదల చేసిన తర్వాతి రోజే మరో పరిశోధన మానవాళిని హెచ్చరించింది. వాతావరణ మార్పులను అంచనా వేసే జర్మన్వాచ్ నిర్వహించిన పరిశోధన ఫలితాలను వెల్లడించింది. గతేడాది వాతావరణ మార్పులు జపాన్, ఫిలిప్పీన్స్, జర్మనీ దేశాలపై అధిక ప్రభావం చూపినట్లు పరిశోధనలో తేలింది. ఆ తర్వాత మడగాస్కర్, భారతదేశాలపై అధిక ప్రభావం కనిపించినట్లు వెల్లడైంది.
జపాన్ కుదేలు
2018 సంవత్సరంలో జపాన్‌లో సంభవించిన భయంకరమైన వడగాలులు, తుపానులు కారణంగా వందలాది మంది మృత్యువాతపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా.. ఆర్థిక వ్యవస్థకు 35 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
ఫిలిప్పీన్స్ బీభత్సం
ప్రమాదకరమైన 5వ కేటగిరీ తుపాను 'మంగూత్' సైతం అదే సంవత్సరంలో ఫిలిప్పీన్స్‌ను కుదిపేసింది. ఆ సమయంలో కొండచరియలు విరిగిపడి దాదాపు 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
జర్మనీ భయానకం
వాతావరణ మార్పులు జర్మనీలో తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వడగాలులు, కరవుతో పాటు సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతల కారణంగా 1,250 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. వ్యవసాయ రంగం కుదేలై, 5 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగింది.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలపైనా వాతావరణ మార్పులు పెను ప్రభావం చూపుతున్నాయి. భూతాపం కారణంగా 2018లో సంభవించిన ప్రకృతి విపత్తులతో ఐరోపాలోని చాలా ప్రాంతాలు ఈ ప్రభావానికి గురైనట్లు పరిశోధన వెల్లడించింది.
"వాతావరణ మార్పులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య సుధీర్ఘంగా ప్రభావం చూపగలిగే సంబంధాలు ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఐరోపాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే వేడి తరంగాలు శతాబ్దం కంటే ముందు పరిస్థితులతో పోలిస్తే 100 రెట్లు ప్రమాదకరంగా తయారయ్యాయి."
-లారా షాఫర్, పరిశోధకురాలు, జర్మన్వాచ్.
భారత్‌నూ కుదిపేసిన విపత్తులు
2018 సంవత్సరంలో భారతదేశం సైతం అత్యంత ప్రభావవంతమైన ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నట్లు నివేదికలో ప్రస్తావించింది జర్మన్వాచ్. రెండు తుపానులు భారతదేశంలోని పలు ప్రాంతాలను కుదిపేసినట్లు వెల్లడించింది. ఈ శతాబ్దంలో కనీవినీ ఎరుగని విధంగా వరదలు సంభవింనట్లు పేర్కొంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ 38బిలియన్ డాలర్లు కోల్పోయినట్లు పరిశోధన స్పష్టం చేసింది.