ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాప్తి ఆగిపోవడం అసంభవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే.. వ్యాధి వల్ల సంభవించే మరణాలు, ఆసుపత్రిల్లో చేరే వారి సంఖ్యను సమర్థవంతమైన కరోనా టీకాలు గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రొగ్రామ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ వ్యాఖ్యానించారు.
"వైరస్ కట్టడికి..టీకాలు సహాయపడుతున్నాయి. ఇవి కొవిడ్ వ్యాప్తిని నియంత్రిస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ప్రస్తుతం కరోనావ్యాప్తి నియంత్రణలోనే ఉంది. అయితే.. మార్పులు చెందుతున్న వైరస్‌తో ఏమైనా జరగవచ్చు."
- మైకేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ ప్రొగ్రామ్ డైరెక్టర్.
అది ఆశ్చర్యం కల్గించలేదు..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు అందకముందే.. ధనిక దేశాల్లోని యువత, ఆరోగ్యవంతులకు వ్యాక్సిన్ ఇవ్వడంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ విచారం వ్యక్తం చేశారు. మహమ్మారి నిర్మూలనకు అన్నిదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా.. ఏడు వారాల తర్వాత కొవిడ్ కేసుల సంఖ్య పెరగడం నిరాశపరిచిందనీ, కానీ ఆశ్చర్యం కల్గించలేదని తెలిపారు. కేసులు పెరుగుదలకు కారణాలు విశ్లేషిస్తున్నామని చెప్పారు. ప్రజల నిర్లక్ష్యం కూడా వైరస్ వ్యాప్తికి కొంత కారణమన్నారు.