చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికిపైగా మరణించారు. ఇటలీలో ఇప్పటివరకు 107 మంది కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 28 మంది చనిపోయారు. చైనా తర్వాత అత్యధిక మరణాలు ఇటలీలోనే కావటం గమనార్హం.
6 కోట్ల జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటివరకు 3 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ పుట్టిన చైనాలో కన్నా వేగంగా ఇటలీలో వ్యాపిస్తోంది. ఇటలీలో 22 ప్రాంతాలుండగా.. 21 రీజియన్లలో వైరస్ కేసులు నమోదయ్యాయి.
ముద్దులు వద్దు..
అప్రమత్తమయిన ఇటలీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమయింది. కీలక శాఖలకు చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ప్రజలు ఎక్కువ గుమిగూడే కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. పాఠశాలలను మార్చి 15వరకు మూసివేసింది.
పలకరింపుల విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించింది. ఎదుటివారిని పలకరించేందుకు ముద్దులు, కరచాలనాలపై నిషేధం విధించింది.
ఇరాన్లో 92..
ఇరాన్లో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 92కు చేరుకుంది. దాదాపు 3 వేల కేసులు నమోదయ్యాయి. వ్యాప్తిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. పాఠశాలలను మూసివేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలపై నిషేధం విధించింది. పనిగంటలను కూడా కుదించారు.
మరోవైపు సాయం అందిస్తామన్న అమెరికా ప్రకటనను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ తోసిపుచ్చారు. అమెరికా ఆంక్షల వల్లే దేశవాసులు ఔషధాలను పొందలేకపోతున్నారని ఆయన తెలిపారు.
అమెరికాలో 9 మంది..
అమెరికాలో కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకు 9 మంది మృతి చెందారు. 130 మందికి వైరస్ సోకింది. ఇరాక్‌లో తొలి మరణం నమోదైంది. దక్షిణ కొరియాలో మాత్రం కరోనా కేసులు తగ్గుతున్నాయి. బ్రస్సెల్స్‌లోని ఐరోపా సమాఖ్య కార్యాలయంలో పని చేసే ఇద్దరు సిబ్బందికి వైరస్ సోకింది. హంగేరీలో చదువుకుంటున్న ఇద్దరు ఇరాన్ విద్యార్థులకు కరోనా సోకినట్లు ఆ దేశ ప్రధాని తెలిపారు.
హజ్‌యాత్రపై నీలినీడలు!
కరోనా భయంతో ఏటా జరిగే ఉమ్రా తీర్థయాత్రను నిలిపివేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఫలితంగా హజ్‌యాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి.
కరోనాపై పోరాటానికి చాలా దేశాలు మాస్కులు, శస్త్ర చికిత్సకు అవసరమైన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తున్నాయి.