భారత సంతతి విద్యార్థిని దివ్య విన్సెంట్ 12 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లాండ్ కెంట్ ప్రాంతంలోని సెనెనోయక్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోన్న దివ్య.. తన ప్రాజెక్టుతో జీఎస్కే యూకే యంగ్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది.
'మైక్రోగ్రీన్స్ ఫ్రమ్ గోల్డ్‌ఫిష్' అనే ప్రాజెక్టుగానూ ఈ అవార్డు లభించింది. సూక్ష్మహరిత మొక్కలుగా, మైక్రోగ్రీన్స్‌గా పిలుచుకునే మొక్కలను అక్వేరియంలోని నీటితో పెంచింది దివ్య. వీటిని మరో మూడు పద్ధతుల్లో పెంచిన వాటితో పోల్చి చూసి.. దివ్య చేసిన ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఈ టైటిల్‌తో పాటు చిన్నారికి ప్రైజ్ మనీ కింద రూ. 1,87,813 అందాయి.
" ప్రాథమిక ఎంపికకు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది నా తొలి ప్రయత్నం. కొంత ఆందోళన చెందినప్పటికీ.. తిరువనంతపురంలో మా తాత చేసిన దానిని చూసి నేను ఇక్కడ ప్రదర్శించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తోట పక్కన రంగురంగుల చిన్న చేపలతో ఉన్న చిన్న చెరువు ఉంది. అందులో బచ్చలికూరను పెంచుతారు."
– దివ్య విన్సెంట్, విద్యార్థిని