అమెరికా, స్పెయిన్, ఇటలీ.. కరోనా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉన్న దేశాలు. ఈ మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70వేల మంది మరణిస్తే.. ఈ మూడు దేశాల్లోనే 38,144 మంది మృత్యువాత పడ్డారు. కేసుల పరంగా చూస్తే.. మొత్తం 12.74లక్షల్లో 5,97,424 కేసులు అమెరికా, స్పెయిన్, ఇటలీలోనే నమోదయ్యాయి. అయితే గతకొద్ది రోజుల గణాంకాలు ఆయా దేశాల ప్రజలకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. మృతులు, కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల నమోదవడమే ఇందుకు కారణం.
మొదటిసారి తగ్గాయి
యూఎస్‌లో కరోనా కేంద్ర బిందువైన న్యూయార్క్ నగరంలో రోజువారీ మరణాలు, ఐసీయూలో చేరే రోగులు, వెంటిలేటర్లు అవసరమయ్యే వారి సంఖ్యలో కాస్త తగ్గుదల నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. అటు ఇటలీ, స్పెయిన్‌లోనూ కరోనా మరణాల సంఖ్య తగ్గింది. ఇటలీలో ఆదివారం 525 మంది ఈ వైరస్ కాటుకు బలయ్యారు. దేశంలో గత రెండు వారాలకుపైగా రోజువారీ మరణాల సంఖ్యలో ఇదే అత్యల్పమని అధికారులు వెల్లడించారు. స్పెయిన్‌లోనూ వరుసగా మూడోరోజు కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. స్పెయిన్‌లో ఆదివారం 674 మంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోగా.. గత వారం రోజుల్లో ఈ సంఖ్య 800 కంటే తక్కువగా నమోదవడం ఇదే తొలిసారి.
బ్రిటన్ పరిస్థితి మరోలా..
బ్రిటన్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదివారం ఆ దేశంలో రికార్డుస్థాయిలో 600 మంది మృత్యువాతపడ్డారు. అదే సమయంలో ఐరోపాలో కరోనా కేంద్రబిందువైన ఇటలీలో 525 మరణాలు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణించిన వారి జాబితాలో ఇటలీ మొదటిస్థానంలోనే ఉంది. జర్మనీ, ఫ్రాన్స్‌లోనూ మృతులతో పాటు కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.
చైనాలో కొత్తకేసులు
కరోనా కేంద్రబిందువైన చైనాలోనూ వైరస్ మరోమారు విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాలో దాదాపు 76,964 మంది ఈ మహమ్మారి బారిన పడి కోలుకోగా.. ఆదివారం ఒక్కరోజే కొత్తగా మరో 39 కేసులు గుర్తించారు అధికారులు. వీరిలో 38 మంది విదేశాల నుంచి వచ్చినవారేనని వెల్లడించారు. లక్షణాలు కనిపించని కరోనా కేసులూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
దేశాధినేతల హెచ్చరికలు
కరోనా పాజిటివ్‌గా తేలిన 10 రోజులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆయన.. వైరస్ లక్షణాలు పూర్తిగా పోనందున వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. మరోవైపు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2.. కరోనాపై తప్పక విజయం సాధిస్తామని దేశ ప్రజలకు సందేశమిచ్చారు.
అమెరికన్ల జీవితంలో రానున్న వారాలు మరింత కఠినంగా ఉండే అవకాశాలున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై.. సామాజిక దూరం పాటించాలని సూచించారు.