బార్సిలోనాలో పుట్టిపెరిగిన ఆండ్రియాకు కొత్త ప్రదేశాలకెళ్లడం, దేశాలు చుట్టి రావడం మహా సరదా. ఫ్యాషన్ డిజైన్, ఎంబీఏ పూర్తవగానే వ్యాపార రంగంలోకి రావాలనుకుంది. అదేసమయంలో స్వైన్‌ఫ్లూ ప్రపంచమంతా విస్తరిస్తోంది.
విభిన్న ఆలోచనతో..
ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో ముడిపడ్డ వ్యాపారానికి గిరాకీ ఎక్కువని తనకు అర్థమైంది. హ్యాండ్ శానిటైజర్ డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చింది. కొన్నాళ్లయ్యాక సొంతంగా శానిటైజర్ పరిశ్రమ పెట్టాలనుకుంది. తాను తయారు చేయబోయే ప్రొడక్ట్ మాత్రం భిన్నంగా ఉండాలనుకుంది. వినియోగదారుల అభిరుచుల్ని తెలుసుకునేలా ఒక సోషల్ మీడియా బృందాన్ని తయారు చేసింది. వారిచ్చిన సూచనలతో యాపిల్ ఫోన్ డిజైన్‌లా ఆకర్షణీయమైన 'పవర్ మిస్ట్'లు సిద్ధం చేసింది. వీటిని తేలిగ్గా జేబులో పెట్టుకోవచ్చు. అలాగే 'టచ్‌లాండ్' పేరుతో మొత్తం ఎనిమిదిరకాల సువానలు వెదజల్లే పవర్‌మిస్ట్‌లు రూపొందించారామె.
800 రెట్లు ఎగబాకిన గిరాకీ..
నెలరోజుల నుంచి కొవిడ్-19 విస్తరించడంతో టచ్‌లాండ్‌కి ఊహించని గిరాకీ వచ్చిపడింది. దీన్ని రెండుచేతులా అందిపుచ్చుకుంది ఆండ్రియా. ఉత్పత్తి భారీగా పెంచింది. మామూలు రోజుల్లో కన్నా ఇప్పుడు ఎనిమిదివందల రెట్లు గిరాకీ ఉంది. దేశదేశాల నుంచి లక్షలకొద్దీ ఆర్డర్లు పెండింగ్‌లోఉన్నాయి. సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్, బ్యాక్‌ప్యాక్‌లాగే యూరప్‌లో ప్రతి వ్యక్తి దగ్గరా ఇప్పుడు టచ్‌లాండ్ కనిపిస్తోంది. ఫలితంగా నెలరోజుల్లోనే టచ్‌లాండ్ వందల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది. ఈమె ప్రయత్నాన్ని ప్రఖ్యాత 'ఫోర్బ్స్ మేగజైన్' గుర్తించి ప్రశంసించింది.
ఇదీ చదవండి: ట్రంప్ కూడా ఆ పెద్దాయనకు ఎదురుచెప్పడం లేదు!