పగలు, రేయి గురించి మనకు ఎంత బాగా తెలుసో, వేళలకు అనుగుణంగా మనం ఎలా ప్రవర్తిస్తామో.. మన శరీరంలోని ప్రతి కణమూ అదే విధంగా మసలుకొంటుందట! రోగనిరోధక వ్యవస్థలోని కణాలు కూడా ఆయా వేళలకు అనుగుణంగానే పనిచేస్తాయట. 'శరీర గడియారం (బాడీ క్లాక్)- ప్రతిస్పందనలు' గురించి ఐర్లండ్‌కు చెందిన ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఆర్‌సీఎస్‌ఐ) యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సస్ నిపుణులు కొత్త విషయాలు కనుగొన్నారు. సాధారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు మనపై దాడిచేస్తే.. రోగనిరోధక వ్యవస్థ వాటిపై యుద్ధం ప్రకటించి, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. మరి, ఈ వ్యవస్థ రేయింబవళ్లు ఒకేలా పనిచేస్తుందా? అంటే.. కాదంటున్నారు ఆర్‌సీఎస్‌ఐ పరిశోధకులు!
ప్రతి జీవకణం కొన్ని ప్రొటీన్ల సముదాయం. వేళల గురించి వాటికి సమాచారం ఉంటుంది. దీని ఆధారంగా శరీరంలో 24 గంటలూ 'సర్కాడియన్ రిథమ్స్' ఉత్పత్తి అవుతాయి. వీటిని బట్టే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్న స్పందనలు ఉద్భవిస్తాయి. రాత్రి కాగానే మనలో మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఇది మనల్ని అలసిపోయేలా చేసి.. నిద్రపోవాలన్న సంకేతాలు ఇస్తుంది.
రాత్రిపూట సన్నద్ధం..
రోగనిరోధక కణాలు పగటిపూట కణజాలాల్లో విస్తరించి, శరీరమంతటా వ్యాపిస్తాయి. రాత్రి మాత్రం లింఫ్ గ్రంథుల వద్ద ఆగిపోతాయి. ఉదయమంతా శరీరంలో ఏం జరిగింది? ఎక్కడెక్కడ ఇన్‌ఫెక్షన్లు ఉన్నాయి అన్నది ఆ సమయంలో అవి గుర్తుచేసుకుంటాయి. తద్వారా ఉదయం ఆయా చోట్ల బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడేందుకు సన్నద్ధమవుతాయి. ఈ ప్రతిస్పందనకు ఆధారం కూడా సర్కాడియన్ రిథమ్సే. మనం ఏ స్థాయిలో అనారోగ్యానికి గురయ్యామన్నది కూడా ఏ సమయంలో మనపై సూక్ష్మక్రిముల దాడి జరిగిందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కరోనా వైరస్ ఏ సమయంలో సోకిందన్నది దానిపై కూడా రోగనిరోధక వ్యవస్థ స్పందన ఆధారపడి ఉంటుంది.
- ఇక ఏ సమయంలో ఔషధం వేసుకుంటున్నాం అన్నదానిపైనా.. స్వస్థత వేగం ఆధారపడి ఉంటుంది. శరీరంలో రాత్రిపూట కొవ్వులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి కొవ్వులను నియంత్రించే మందులను పడుకోవడానికి ముందు వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.
- వ్యాక్సిన్ల విషయంలోనూ ఇంతే. మధ్యాహ్నం 3-5 గంటల మధ్య టీకా వేయించుకున్న వారితో పోల్చితే, ఉదయం 9-11 గంటల మధ్య వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇన్‌ఫ్లుయెంజా తదితర టీకాల విషయంలో గతంలోనే ఇది స్పష్టమైంది. కొవిడ్ టీకాల విషయంలో ఇది ఎలా ఉందన్న దానిపై పరిశోధనలు జరగాల్సి ఉంది’’ అని నిపుణులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆ దేశ మాజీ ప్రథమ మహిళకు పదేళ్ల జైలు