Attack on Drone with Pickle jar: రష్యా యుద్ధ ట్యాంకర్‌ను ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్ రైతు.. ఆరు విమానాల్ని కూల్చేసిన ఒకే ఒక్కడు.. ఇలా ఎన్నో వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్నింటి గురించి వినడమే తప్ప.. సరైన ఆధారాలు ఎక్కడా లేవు. బలమైన రష్యా సేనపై పోరాడుతున్న ఉక్రెయిన్ సైనికులు, పౌరుల్లో కదనోత్సాహం నింపేందుకు ఇలాంటి కథనాలు వ్యాప్తి చెందుతున్నాయన్న వాదనల మధ్య మరో వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ వృద్ధురాలు టమాట ఊరగాయ సీసాతో రష్యా డ్రోన్‌ను కూల్చేసిందన్నది దాని సారాంశం.
సీసాతో డ్రోన్‌ను కూల్చేయడంపై రకరకాల కథనాలు చక్కర్లు కొట్టినా.. అది నిజం కాకపోవచ్చని ఎక్కడో ఓ అనుమానం ఉండేది. అయితే.. అది ముమ్మాటికీ సత్యం అంటూ ఓ మహిళ ఉక్రెయిన్‌కు చెందిన లిగా.లైఫ్ వార్తా సంస్థను సంప్రదించింది. ఆ పని చేసింది తానేనంటూ.. అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
grandma drone pickle attack
"నా పేరు ఎలీనా. గతంలో జర్నలిస్టుగా చేశా. తర్వాత వ్యాపారవేత్తగా మారాను. ఓరోజు కీవ్‌లోని నా ఇంటి బాల్కనీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నా. అప్పుడు జయ్.. అంటూ ఏదో శబ్దం వినిపించింది. చూస్తే ఏదో ఎగురుతూ కనిపించింది. పక్షి అనుకున్నా. కానీ కాదు. చుట్టూ ఏం ఉన్నాయా అని చూస్తే.. కుర్చీ కింద టమాట ఊరగాయ సీసా ఉంది. దాన్ని తీసి బలంగా డ్రోన్‌పై విసిరా. అది కిందపడి ముక్కలైంది. రోడ్డుపై పడిన శకలాలు అన్నింటినీ ఊడ్చేశా. డ్రోన్ విడిభాగాలను వేర్వేరు చెత్త బుట్టల్లో వేశా. అన్నీ ఒకే దగ్గరే పెడితే అది ఇంకా పనిచేస్తుందేమో, మన సమాచారం రికార్డ్ చేసి పంపుతుందేమోనని ఇలా చేశా." అని ఎలీనా చెప్పినట్లు ఆ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. అయితే.. ఇదంతా ఎప్పుడు జరిగిందో మాత్రం చెప్పలేదు.
అది కీరా కాదు.. టమాట!
యుద్ధం కారణంగా అనేక మంది కీవ్ నగరాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. అనేక ఇళ్లు ఖాళీ అయిపోయాయి. అలాంటి ఇళ్లలోని సామగ్రిని ఎత్తుకెళ్లేందుకు కొందరు ఈ డ్రోన్ సాయంతో రెక్కీ నిర్వహిస్తూ ఉండొచ్చని చెప్పింది ఎలీనా. తాను డ్రోన్‌పైకి కీరా ముక్కలు ఊరబెట్టిన సీసా విసిరానని తొలుత వార్తలు వచ్చాయని.. అవన్నీ అసత్యమని స్పష్టం చేసింది. టమాట ఊరగాయ సీసాతోనే తాను రష్యా డ్రోన్‌పై దాడి చేశానని చెప్పింది.
ఎలీనా కూల్చినట్లు చెబుతున్న డ్రోన్.. ఆయుధాలు ప్రయోగించే మిలటరీ డ్రోన్ అయి ఉండదని నిపుణులు చెబుతున్నారు. నిఘా కార్యకలాపాల కోసం ఫొటోలు, వీడియోలు తీసే సాధారణ డ్రోన్‌పై ఆమె సీసా విసిరి ఉండొచ్చని అంటున్నారు.
నిజమెంతో..?
ఊరగాయ సీసాతో డ్రోన్‌ను కూల్చిన కథ కల్పితమని తొలుత అనేక మంది భావించారు. అయితే.. ఓ వార్తా సంస్థ ఎలీనా మాటల్ని ఉటంకిస్తూ కథనం ప్రచురించాక కొందరు ఆ అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్ సైనికులు, సాధారణ పౌరులు రష్యా సేనలపై వీరోచితంగా పోరాడుతున్నారని చెప్పేలా ఇప్పటికే అనేక కథనాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 24న జిమిన్యీ ద్వీపం బోర్డర్ గార్డ్స్.. రష్యా సేనల్ని ధైర్యంగా ఎదుర్కొని, వీరమరణం పొందారన్న వార్త చర్చనీయాంశమైంది. అయితే.. వారు చనిపోలేదని, రష్యా సైన్యం బంధించిందని తర్వాత తెలిసింది. ఇదే తరహాలో రష్యాకు చెందిన ఆరు విమానాల్ని కూల్చేశాడంటూ ఓ ఉక్రెయిన్ ఫైటర్ పైలట్ గురించి కథలు వచ్చాయి. కానీ.. అతడి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అయితే ఇలాంటి కథలన్నీ కల్పితం అయి ఉండొచ్చని ఆధారాల కోసం ప్రయత్నించిన వేర్వేరు మీడియా సంస్థలు విశ్లేషించాయి.
ఇదీ చదవండి: న్యూక్లియర్ ప్లాంట్‌కు కరెంట్ కట్.. ఉక్రెయిన్‌లో డేంజర్ బెల్స్!