G-20 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలకు సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ కనీస పన్నును 15శాతంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని G-20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి వెల్లడించారు. పారదర్శక, ప్రభావవంతమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.
ఈ ఒప్పందంతో మల్టీ నేషనల్ కంపెనీలు ఇక నుంచి 15శాతం పన్నును ఆయా దేశాలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ(OCED) ఈనెల మొదట్లోనే అంతర్జాతీయ పన్ను సంస్కరణలను ఖరారు చేసింది. మల్టీ నేషనల్ కంపెనీల పన్ను రేటు 2023నుంచి 15శాతంగా ఉండాలని నిర్ణయించింది. ఈ ఒప్పందానికి 136 దేశాలు అంగీకారం తెలిపాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా దాదాపు 90 శాతం.
అంతర్జాతీయ కనీస పన్ను వల్ల మల్టీ నేషనల్ కంపెనీలు ట్యాక్స్ భారం తప్పించుకునేందుకు ఉద్యోగాలు, లాభాలను ఇతర దేశాలకు తరలించడానికి వీలు ఉండదు. ఫలితంగా ఆయా దేశాలకు ట్యాక్స్ రూపంలో మరింత ఆదాయం సమకూరుతంది. ఒక్క అమెరికాకే ఈ ట్యాక్స్ ద్వారా 60 బిలయన్ డాలర్ల ఆదాయం రానున్నట్లు తెలుస్తోంది.