కరోనా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అన్ని రంగాలపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. వినోద రంగంపైనా తీవ్ర ప్రభావం చూపింది. లాక్డౌన్ కారణంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. జనం కూడా రెండు, మూడు నెలలు ఇవి లేకుండా ఎలాగోలా ఉండగలిగారు. ఇంకా ఎన్ని రోజులనో ఏమో.. కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రపంచదేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. క్రమక్రమంగా జనాలకు ఇష్టమైన షాపింగ్ మాళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి.
అయితే.. వారాంతాల్లో జనం కిక్కిరిసిపోయే ఈ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తికి అవకాశం ఎక్కువే. మరి జనం వస్తారంటారా..! ఇంకా తెలియనివారి పక్కన కూర్చొని సినిమా చూడాలనుకుంటారా.. వారితో కలిసి షాపింగ్ చేస్తారా..! అందుకే ఆయా దేశాలు విభిన్నంగా ప్రయత్నిస్తున్నాయి. కొత్త కొత్త పద్ధతులు, ఇనిషియేటివ్‌లను పరిచయం చేస్తూ ప్రజల్ని రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి.
జనాలు గుంపులు గుంపులుగా సంచరించే ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ ఒకటి. మరి కరోనా భయాందోళనలతో ఇవి పునర్వైభవం సంతరించుకుంటాయా? ఒకప్పటిలా గంటలు గంటలు మాల్స్‌లో గడపలేమా? కరోనా ఏం మార్పులు తెచ్చింది?
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: అపాయింట్మెంట్ ఉంటేనే షాపింగ్ మాల్‌కు ఎంట్రీ!
మిగతా ఏయే దేశాల్లో ఎలా చేస్తున్నారో ఓ సారి చూద్దాం...
డ్రైవ్ ఇన్ సినిమా..
రొమేనియా.. ఈ ఐరోపా దేశంలో కరోనా ధాటికి ఇప్పటివరకు దాదాపు 1300 మంది మరణించారు. 20 వేల మంది వైరస్ బారినపడ్డారు. కొద్దిరోజుల లాక్డౌన్ అనంతరం.. ఇక్కడ భౌతిక దూరం నిబంధనను తప్పనిసరి చేస్తూ ఆంక్షలను సడలించారు.
ఈ క్రమంలో సినీ అభిమానుల కోసం కొత్తగా ప్రయత్నించింది ఆ దేశం. డ్రైవ్ ఇన్ సినిమాకు డిమాండ్ పెరగడం వల్ల బయటి ప్రదేశాల్లోనే థియేటర్లను ఏర్పాటు చేసి.. సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అదీ కార్లో నుంచే చూడాలి. పాప్‌కార్న్, స్నాక్స్, డ్రింక్స్ కూడా వారే తీసుకొస్తారు.
బుఛారెస్ట్ నగరంలో అలాగే ప్రయత్నిస్తున్నారు. రోజూ నాలుగు షోలు వేస్తున్నారు. ఒక టికెట్ ధర. 10 యూరోలు. కార్లో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుండాలి. కరోనా నేపథ్యంలో వీక్షకులూ దీనిని స్వాగతిస్తున్నారు.
''కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికీ మనం భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నాలు బాగున్నాయి. దూరం పాటిస్తూ సినిమాను మేం ఆస్వాదించగలం.''
- స్థానికురాలు
దేశవ్యాప్తంగా ఓపెన్ ఎయిర్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. ఇతర వేడుకలకూ రెండు మీటర్ల భౌతిక దూరం నిబంధన తప్పనిసరి చేస్తూ అనుమతిస్తున్నారు.
నీటిపై తేలియాడుతూ..
జనాన్ని రెస్టారెంట్లకు రప్పించడానికి నెదర్లాండ్స్‌లో హోటల్ యాజమాన్యాలు వినూత్న ఆలోచన చేశాయి. ఆమ్స్టర్డామ్లోని మాడియామేటిక్ ఈటెన్ రెస్టారెంట్‌ను విభిన్నంగా తీర్చిదిద్దారు. నీటిపై తేలియాడుతూ ఉండే ఆ రెస్టారెంట్లో అతిథుల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా.. ప్రతీ టేబుల్ చుట్టూ గ్రీన్‌హౌసెస్, కర్టెయిన్లను ఏర్పాటుచేశారు.
ఇక్కడ వెయిటర్లు, కస్టమర్ల మధ్య భౌతిక దూరం నిబంధన కచ్చితంగా పాటిస్తారు. ఆ గది బయటినుంచే సర్వ్ చేస్తారు సిబ్బంది.
చక్కని ప్రదేశంలో ఆత్మీయులు, స్నేహితులతో నచ్చిన ఆహారం తింటూ సరదాగా గడుపుతున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు చాలా మంది తమ రెస్టారెంట్‌కు వస్తున్నారంటూ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నెదర్లాండ్స్‌లో బార్లు, రెస్టారెంట్లూ తెరుచుకున్నాయి. అక్కడ ముందస్తు రిజర్వేషన్ తప్పనిసరి. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా అక్కడే కూర్చోవడానికి అనుమతి లేదు.
ఇజ్రాయెల్‌లో రెస్టారెంట్లు..
ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లను ప్రోత్సహిస్తోంది ఇజ్రాయెల్. అక్కడి టెల్అవీవ్లో వారాంతాల్లో జనం భారీగా వస్తున్నారు. నచ్చిన, మెచ్చిన ఆహారం బయట తింటూ ఆనందంగా గడుపుతున్నారు.
లోపలి ప్రదేశంలో టేబుళ్ల మధ్య 1.5 మీటర్ల దూరం పాటిస్తున్నారు. పునర్వినియోగపర్చలేని మెనూలు, ప్లేట్లు, స్పూన్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
''ప్రస్తుత మార్గదర్శకాలను పాటిస్తూ నేను సురక్షితంగా ఉన్నానని భావిస్తున్నా. ఇప్పటికీ చక్కని ప్రదేశంలో కూర్చొని నచ్చిన ఆహారం తింటూ, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా.''
- ఓ అతిథి
థాయ్‌లాండ్‌లో...
కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో థాయ్‌లాండ్‌లో సినీప్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లు తెరుచుకున్నాయి. అయితే.. నిర్వాహకులు వైరస్ వ్యాప్తి జరగకుండా చూస్తున్నారు.
థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 75 శాతం వరకు తగ్గించారు. వీక్షకుల మధ్యలో రెండు సీట్ల దూరం పాటిస్తున్నారు. సినిమా ప్రదర్శనకు ముందూ, తర్వాత ప్రాంగణాలను మొత్తం.. సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు.
టికెట్ల కొనుగోలుకూ ఆన్లైన్ విధానాన్నే ప్రోత్సహిస్తున్నారు. చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన వారంతా సరదాగా బయటికొస్తున్నారు.
బీచ్‌లు తెరుచుకున్న క్రమంలో రద్దీ పెరిగిపోయింది. అక్కడా భౌతిక దూరం నిబంధన, మాస్కులను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మార్గదర్శకాలను పాటిస్తూ పర్యటకులు తరలివస్తున్నారు.