రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'మీడియాపార్ట్' పేర్కొంది. రూ.59 వేల కోట్లు విలువ చేసే ఈ ఒప్పందం విషయంలో దర్యాప్తు జరిపేందుకు ఓ న్యాయమూర్తిని కూడా నియమించినట్లు తెలిపింది. భారత్- ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ఒప్పందం కావడంతో ఈ అంశానికి ఇరు దేశాల్లో ప్రాధాన్యం ఏర్పడింది.
ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌కు చెందిన ఫినాన్షియల్ క్రైమ్స్ విభాగం సైతం దర్యాప్తు ప్రారంభమైనట్లు ధ్రువీకరించిందని 'మీడియాపార్ట్' పేర్కొంది. ఈ ఒప్పందం ఖరారు సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంకోయిస్ హోలండే వ్యవహరించిన తీరుపైనే ప్రధానంగా దర్యాప్తు సాగనున్నట్లు తెలిపింది.
రఫేల్ ఒప్పందంపై 'మీడియాపార్ట్' సొంతంగా పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించింది. ఒప్పందం ఖరారు సమయంలో పలువురికి ముడుపులు ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే కొంతమందికి కావాలనే అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ విషయం అప్పటి ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ చీఫ్ హ్యూలెట్ దృష్టికి వచ్చినప్పటికీ.. విచారణను పక్కకు పెట్టేశారని ఆరోపించింది. ఒప్పందాలు ప్రభుత్వాల స్థాయిలో జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ దేశానికే అప్రతిష్ఠ వచ్చే అవకాశం ఉందన్న వాదనతో ఆయన తన సహచరులను ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపింది.
రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న డసో ఏవియేషన్.. తాజా దర్యాప్తు ప్రారంభం విషయమై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, ఒప్పందాల ఖరారు విషయంలో తాము ఎలాంటి తప్పుడు విధానాలను అవలంభించలేదని గతంలో తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలు దర్యాప్తు కూడా జరిపినట్లు పేర్కొంది. కానీ, ఎక్కడా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు నిరూపితం కాలేదని తెలిపింది.
2016లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలను తయారు చేయాల్సిన డసో ఏవియేషన్ ఇండియా ఆఫ్‌సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకుంది. అయితే, ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌ను ఎలా చేర్చుకుంటారన్నది భారత్‌లో ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై హోలండే స్పందిస్తూ.. భారత ప్రభుత్వ ఒత్తిడి మేరకే రిలయన్స్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని.. తమ ముందు ఇంకో ప్రత్యామ్నాయమే లేకపోయిందని అన్నట్లు 'మీడియాపార్ట్' పేర్కొంది. మరోవైపు భారత్‌లో ఓ మధ్యవర్తికి దాదాపు 8.6 కోట్లు కమిషన్‌గా అందించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపింది. అలాగే రఫేల్ ప్రొటోటైప్ తయారీకే ఈ సొమ్మును చెల్లించినట్లు డసో చెబుతున్నా.. అలాంటి నమూనా విమానాలేవీ అందించినట్లు ఆధారాలు లేవని తెలిపింది.
ఇదీ చూడండి: ఒకేసారి 88 ఉపగ్రహాలను నింగిలోకి పంపిన స్పేస్ఎక్స్