చైనాను గడగడలాడిస్తున్న కొవిడ్-19(కరోనా వైరస్) ధాటికి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి మృతిచెందారు. ఫ్రాన్స్‌లో పర్యటించడానికి వచ్చిన ఓ 80ఏళ్ల చైనా వృద్ధురాలికి వైరస్ సోకగా.. పారిస్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆ దేశ ఆరోగ్య శాఖమంత్రి ఆగ్నెస్ బుజిన్ తెలిపారు. అదే ఆసుపత్రిలో మరో ఆరుగురు ఈ మహమ్మారి బారినపడినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు మృతురాలి కుమార్తె కాగా, మిగిలినవారు బ్రిటన్‌కు చెందినవారని చెప్పారు.
చైనీయేతర దేశాల్లో 600మందికి పైగా...
గత డిసెంబర్ నుంచి ప్రబలుతున్న కరోనా వైరస్ కారణంగా.. చైనాలో రోజుకు వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా ఫిలిప్పీన్స్, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల్లోనూ ఒక్కొక్కరి చొప్పున కరోనా సోకి మరణించారు. చైనాయేతర దేశాల్లో 600 మందికి పైగా ఈ మహమ్మారి వ్యాప్తిచెందగా. అందులో జపాన్ తీరంలోని క్రూయిజ్‌షిప్ ప్రయాణికుల్లోనే 285 మంది వరకూ ఉన్నారు. యూరప్‌లోనే సుమారుగా 35 మందికి కరోనా ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: వైద్యులపైనే కరోనా పంజా - చైనాలో ఆరుగురు మృతి