కొవిడ్-19 కారక సార్స్-కోవ్-2 వైరస్ ఇన్ఫెక్షన్ తొలుత 2019 డిసెంబరులో ఉత్పన్నమైందని చైనా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే దానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి వ్యాప్తి ఆరంభమై ఉండొచ్చని బ్రిటన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గణిత నమూనా సాయంతో..
కరోనా వైరస్ మూలాలు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి. 2019 డిసెంబరు మొదట్లో అధికారికంగా మొదటి కేసు నమోదైంది. దానికి ముందే ఈ మహమ్మారి విజృంభణ మొదలై ఉండొచ్చన్న వాదనలు ఉన్నాయి. తాజాగా కెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ రాబర్ట్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఒక గణిత నమూనా సాయంతో పరిశీలనలు జరిపారు. నిజానికి ఒక జీవజాతి అంతరించిపోయిన తేదీని లెక్కించడానికి ఈ నమూనాను రూపొందించారు. దానికి కొన్ని మార్పులు చేసి, కరోనా మహమ్మారి ఆరంభ సమయాన్ని నిర్ధరించేందుకు ఉపయోగించారు.
అక్టోబర్‌లోనే..
చైనాలో మొదటి కేసు 2019 అక్టోబరు మొదటి నుంచి నవంబరు మధ్య కాలంలో ఉత్పన్నమై ఉండొచ్చని ఇందులో వెల్లడైంది. అది నవంబరు 17న చోటుచేసుకొని ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా అధికారికంగా అంగీకరించడానికి ముందే చాప కింద నీరులా ఈ వైరస్ వ్యాప్తి చెందిందని చెప్పారు. చైనా నుంచి మొదటి ఐదు దేశాలకు కరోనా ఎప్పుడు విస్తరించిందన్నదానిపై కూడా వారు లెక్కలు కట్టారు.
2020 జనవరి 3న జపాన్‌లో, 7న థాయ్‌లాండ్‌లో, 12న స్పెయిన్‌లో, 14న దక్షిణ కొరియాలో, 16న అమెరికాలోకి వైరస్ ప్రవేశించి ఉండొచ్చని విశ్లేషించారు.
ఇదీ చదవండి : 'ఒకే కాన్పులో 10 మంది' వార్తల్లో ఊహించని ట్విస్ట్