అఫ్గాన్ (Afghan news) నుంచి వీలైనంత ఎక్కువమందిని సురక్షితంగా తరలించే విషయమై తాలిబన్లతో మాట్లాడుతున్నామని, అయితే దానర్థం... వారి పాలనను గుర్తిస్తామని(Taliban international recognition) మాత్రం కానేకాదని యూరోపియన్ యూనియన్ కమిషన్(Taliban international recognition) ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌డెర్ లెయన్ విస్పష్టం చేశారు. తాలిబన్లతో ఇప్పటివరకూ ఎలాంటి రాజకీయ సంప్రదింపులు(political talks) జరపలేదని ఆమె వెల్లడించారు. స్పెయిన్‌లోని టోరెజాన్ సైనిక స్థావరాన్ని ప్రధాని పెడ్రో సంచెజ్‌తో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. కాబుల్ నుంచి తీసుకొస్తున్న శరణార్థులను ఉంచేందుకు ఇక్కడ తాత్కాలిక వసతులు సమకూర్చుతున్నారు. పర్యటన సందర్భంగా లెయన్ విలేకరులతో మాట్లాడారు.
"ఈ సంక్షోభ సమయంలో తాలిబన్‌తో మేము ఎలాంటి రాజకీయ సంప్రదింపులు జరపడం లేదు. అఫ్గాన్ ప్రజలు సురక్షితంగా కాబుల్ విమానాశ్రయం చేరుకునే అంశంపై మాత్రమే ఆ సంస్థతో చర్చిస్తున్నాం. ఇస్లాం ప్రకారం సమాజంలో మహిళలకు తగిన స్థానం ఉంటుందని, వారి ఉపాధి హక్కులను పరిరక్షిస్తామని తాలిబన్లు ప్రకటించారు. కానీ, నాటో దళాలకు సహకరించిన వారిని తాలిబన్లు వేటాడుతున్నట్టు చాలా నివేదికలు వచ్చాయి. చాలా సంస్థల్లో మహిళా ఉద్యోగులను వెనక్కు పంపుతున్నట్టు కూడా సమాచారం అందింది. అఫ్గాన్‌కు వచ్చే ఏడేళ్లలో రూ.8,700 కోట్ల (1 బిలియన్ యూరోల) యూరోల మానవతా సాయం అందించాలని నిర్ణయించాం. కానీ... ఆ దేశంలో మానవ హక్కుల పరిరక్షణ, మైనార్టీల పట్ల వ్యవహరించే తీరు, మహిళలను గౌరవించే విధానంపైనే ఆ నిధుల అందజేత ఆధారపడి ఉంటుంది"
-ఉర్సులా వాన్‌డెర్ లెయన్, యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్
'దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి'
కాబుల్‌లో(kabul) పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని అఫ్గాన్‌లో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ జంతు సంరక్షకుడు, మాజీ రాయల్ మెరైన్ పాల్ ఫార్థింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడుతున్నాయంటూ బ్రిటన్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
"నేను దేశం విడిచి వెళ్లేందుకు సీటు కేటాయిస్తున్నట్టు బ్రిటన్ వర్గాలు సమాచారం ఇచ్చాయి. కానీ, మా సంస్థ నౌజాద్‌లో పనిచేస్తున్న 25 మంది సిబ్బందికి మాత్రం ఆ అవకాశం లేదన్నాయి. ఇక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. మేము విమానాశ్రయం చేరుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది"
-మెరైన్ పాల్ ఫార్థింగ్, జంతు సంరక్షుడు
అయితే.. కాబుల్ నుంచి రోజూ సుమారు వెయ్యి మందిని తరలిస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
ఇదీ చూడండి: 'అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికా పౌరులకు ఐఎస్ ముప్పు'
ఇదీ చూడండి: Afghan Taliban: 'స్వేచ్ఛను కోల్పోయాం.. మళ్లీ మేం బందీలైపోయాం'