బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేడు విధులకు హాజరయ్యారు. డౌనింగ్ స్ట్రీట్- 10లోని తన కార్యాలయానికి వెళ్లారు. ప్రాణాంతక కరోనా బారిన పడిన ఆయన నెలరోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు.
కొద్ది రోజులుగా బయటినుంచే ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న బోరిస్.. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ పగ్గాలను పూర్తి స్థాయిలో తిరిగి చేపట్టారు. డౌనింగ్ స్ట్రీట్లో అడుగుపెట్టే ముందు జాతినుద్దేశించి ప్రసంగించారు బోరిస్. లాక్డౌన్ సమయంలో ప్రజలంతా సహనంతో ఉండాలని కోరారు.
" కరోనా మహమ్మారిపై ఇప్పుడిప్పుడే విజయం సాధిస్తున్నాం. ఈ సంక్షోభంలో మొదటి దశ పూర్తి కాబోతుంది. లాక్డౌన్లో ప్రజలు సహనం కోల్పోకూడదు. దేశంలో రెండో దశ కరోనా ప్రవేశిస్తే ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం."
- బోరిస్ జాన్సన్
బోరిస్ జాన్సన్‌కు మార్చి నెలాఖరులోనే కరోనా వైరస్ సోకింది. కానీ ఆయనకు లక్షణాలు తగ్గకపోవడం వల్ల లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రికి తరలించారు. సమస్య కాస్త తీవ్రం కావడం వల్ల ఐసీయూకు మార్చి చికిత్స అందించారు అధికారులు. చివరకు కరోనాపై విజయం సాధించిన బోరిస్ ఏప్రిల్ 12న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.
సవాళ్ల మధ్య..
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి బదులుగా.. బ్రెగ్జిట్ వ్యూహాన్ని అమలు చేసేందుకు లాక్డౌన్ కఠిన నిబంధనలు ఎత్తివేయాలని సొంత కన్జర్వేటివ్ పార్టీతోపాటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రధాని బాధ్యతలను స్వీకరించారు బోరిస్.
ఇదీ చూడండి: కరోనా తీవ్రత తగ్గుముఖం- క్రమంగా ఆంక్షల ఎత్తివేత!