కరోనా వైరస్ వ్యాప్తిని ముందస్తుగా అరికట్టడంలో చైనా సహా పలు దేశాలు విఫలమయ్యాయని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన నిపుణుల కమిటీ విమర్శించింది. కొవిడ్‌పై మహమ్మారి ముద్ర ఎందుకు వేయలేకపోయిందని ప్రశ్నిస్తూ ఓ నివేదిక రూపొందించింది.
ముందస్తు ప్రజారోగ్య చర్యలకు ఉపక్రమించే అవకాశాలు చేజారిపోయాయి. వాస్తవమేమిటంటే.. అభివృద్ధి చెందుతున్న దేశాలే మహమ్మారిని గుర్తించడానికి సాక్ష్యాలు సమర్పించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. కరోనాను ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
-డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ.
జనవరి 22న కొవిడ్‌పై అత్యవసర కమిటీని నియమించిన డబ్ల్యూహెచ్ఓ.. అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించడానికి వారం రోజుల సమయం తీసుకుందని నివేదిక పేర్కొంది.
సాధారణ 'ఫ్లూ'గానే భావించింది..
గతంలో డబ్ల్యూహెచ్ఓ మహమ్మారి అనే పదాన్ని వాడి ఉంటే.. అదిప్పుడు ఉపయోగపడేదని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది. వైరస్ అనేక ఖండాలకు వ్యాపించిన తర్వాత మార్చి 11న కొవిడ్‌ను మహమ్మారిగా ప్రకటించిందని, శాస్త్రవేత్తలు తేల్చేంత వరకు కూడా డబ్ల్యూహెచ్ఓ.. కరోనాను సాధారణ ఫ్లూగానే పరిగణించిందని వెల్లడించింది.
ఏడాదిగా విమర్శలు..
ఏడాది కాలంగా కొవిడ్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ పై పలు విమర్శలొచ్చినట్లు కమిటీ స్పష్టం చేసింది. "అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి.. ఐరాస ఆరోగ్య సంస్థ, చైనాతో చేతులు కలిపిందని ఆరోపించారు. తమ దేశం నుంచి డబ్ల్యూహెచ్ఓకు వచ్చే నిధులను సైతం నిలిపివేశారు" అని నివేదిక గుర్తుచేసింది.
'అంతర్గతంగా, అంతర్జాతీయంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో పలు దేశాలు సమర్థంగా పని చేశాయి' అని కమిటీ తెలిపింది. కానీ, దేశాల పేర్లు మాత్రం వెల్లడించలేదు.
ఇదీ చదవండి: 'భాజపా.. మావోయిస్టుల కంటే ప్రమాదకరం'