మానవ హక్కుల అంశంలో అమెరికాకు ఉన్న చరిత్రపై చైనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జాతి వివక్ష, పోలీసుల క్రూరత్వం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఐరాస మానవ హక్కుల మండలిలో ఆ దేశాన్ని ఎండగట్టింది. ఈ మేరకు జెనీవాలో బుధవారం నిర్వహించిన సాధారణ సమీక్షా సమావేశంలో చైనా ప్రతినిధి జియాంగ్ డువాన్ మాట్లాడారు. విదేశాల్లో అమెరికా సైన్యం చేపట్టిన హింసాత్మక చర్యలను ఖండించారు.
"విదేశాల్లో అమెరికా సైన్యం జోక్యం చేసుకోవడం వల్ల భారీ సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అమాయక ప్రజలను అమెరికా దళాలు పొట్టనబెట్టుకున్నాయి. వారిని చిత్రహింసలకు గురిచేశాయి. గతంలో జరిగిన మారణహోమాలకు అమెరికా ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. బాధితులకు పరిహారం అందించలేదు."
-జియాంగ్ డువాన్, చైనా ప్రతినిధి
అమెరికాలో కరోనా విజృంభణకు కారణం అక్కడి ప్రభుత్వాలేనని ఆరోపించారు డువాన్. మహమ్మారి నివారణకు సమర్థమైన చర్యలు తీసుకోవడంలో అమెరికా విఫలమైందని అన్నారు. ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఈ ప్రకటన రావడం గమనార్హం. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా పదేపదే అభ్యంతంరం వ్యక్తం చేస్తోంది. హాంకాంగ్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపడం, షింజియాంగ్లో మైనారిటీలపై అణచివేత ధోరణిని అగ్రరాజ్యం ఖండిస్తోంది.
ఇదీ చదవండి: 'ప్రపంచవ్యాప్తంగా 10శాతం పెరిగిన కరోనా కేసులు'