పాకిస్థాన్ మైనారిటీ హింసపై చొరవ తీసుకోవాలని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు బ్రిటీష్ హిందూ సంఘాలు లేఖ రాశాయి. పాక్‌లో హిందువులు తీవ్రమైన హింసకు గురవుతున్నారని వివరిస్తూ ఇటీవల ఆదేశంలోని ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్రంలో హిందూ దేవాలయాన్ని దగ్ధం చేసిన ఘటనను ఉదహరించాయి.
పాకిస్థాన్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేవిధంగా పాక్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చే చర్యలు తీసుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరుతున్నాం. ఇటీవల పాక్‌లో హిందువుల పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఖైబర్ పంఖ్తుంక్వా దేవాలయ ఘటనపై ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రజాస్వామ్యదేశాలతో కలిసి బ్రిటన్ ముందుండి విచారణ జరిపించాలని వేడుకుంటున్నాం.
- బ్రిటీష్ హిందూ సంఘాలు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంక్వా ఘటనపై ప్రపంచ మీడియా మౌనం వహించడంపై హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో మీడియా విఫలమైందని లేఖలో పేర్కొన్నాయి. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయ నిర్మాణానికి ఎదురైన వ్యతిరేకతను ప్రస్తావించాయి. పాక్ ఉన్నతాధికారుల వివాదాస్పద వ్యాఖ్యలను లేఖలో జతచేశాయి. కేవలం హిందువులే కాకుండా క్రైస్తవులు సైతం బాధితులుగా ఉన్నారని లేఖలో విన్నవించాయి.
పాక్‌లో ఖైబర్ పంఖ్తుంక్వా రాష్ట్రంలో డిసెంబర్ 30న హిందూ దేవాలయాన్ని దుండగులు కూల్చివేశారు. శిథిలమైన దేవాలయానికి మరమ్మతు పనులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి:క్యాపిటల్‌పై దాడిని ఖండిస్తూ దౌత్య అధికారుల తీర్మానం