బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, అయన భార్య మేఘన్ మార్కెల్ వారి రాజ బిరుదులు, ప్రజా నిధులను వదులుకోవడానికి అంగీకరించారు. రాజకుటుంబం నుంచి వేరుపడుతున్నట్టు హ్యారీ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కెనడాలో తమ వ్యక్తిగత జీవితాన్ని గడపనున్న ఈ దంపతులతో.. వారం రోజులుగా రాజకుటుంబీకులు చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి ప్రకటన వెలువడింది.
ఈ క్రమంలో క్వీన్ ఎలిజబెత్ మనవడు హ్యారీ, భార్య మేఘన్‌లకు రాజ బిరుదులు వర్తించవు. గతంలో హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 1996లో ప్రిన్స్ చార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత దివంగత డయానా తన బిరుదులను వదులుకున్నారు.
కొన్ని నెలల సంభాషణలు, ఎన్నో చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చాం.నా మనవడు, అయన కుటుంబం కోసం నిర్మాణాత్మక, సరైన మార్గాన్ని ఎంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. రెండేళ్లలో వారు ఎదుర్కొన్న సవాళ్లను నేను గుర్తించాను. స్వతంత్ర జీవితాన్ని గడపాలనుకునే వారి అభిప్రాయానికి నేను మద్దతిస్తున్నాను.
క్వీన్ ఎలిజబెత్ II, బ్రిటన్ రాణి.
హ్యారీ, మేఘన్‌లు కొంత కాలంగా వార్తాల్లో నిలుస్తున్నారు. వారి వ్యక్తిగత జీవితాలపై అనేక మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై హ్యారీ కేసులు పెట్టిన ఘటనలూ ఉన్నాయి. వీటిని ప్రస్తావిస్తూ క్వీన్ ఎలిజబెత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మేఘన్ సంతోషంగా ఉండాలి...
మేఘన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు రాణి. చాలా త్వరగా తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయినందుకు సంతోషంగా ఉందని.. ఈ జంట ఎంతో ఆనందం, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
3.2 మిలియన్ డాలర్లు వెనక్కి...
ఇకపై హ్యారీ దంపతులు రాయల్ ఫ్యామిలీలో సభ్యులుగా కొనసాగరు కనుక వారికి హెచ్ఆర్హెచ్(హిస్ ఆర్ హర్ రాయల్ హైనెస్) వర్తించవని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రత్యేక ప్రకటన వెలువరించింది. వారు అధికారిక సైనిక నియామకాలతో సహా రాజ విధులను వదులుకొనేందుకు అంగీకరించినట్లు, ఇకపై వారికి ప్రజా నిధులు వర్తించబోవని తెలిపింది. వీటితో పాటు విండ్సర్ కాజిల్ సమీపంలోని ఫ్రాగ్మోర్ కాటేజ్ ఇంటిని పునరుద్ధరించేందుకు హ్యారీ దంపతులు ఖర్చు చేసిన.. 3.1 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది.