ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.28లక్షల వైరస్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 10.08కోట్లకు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 15వేల మందికిపైగా బలయ్యారు. మరణాల సంఖ్య 21.65 లక్షలకు చేరింది. బ్రిటన్‌లో మరణాల సంఖ్య లక్ష దాటింది. బ్రిటన్ కన్నా ముందు.. అమెరికా(4.35లక్షలు), బ్రెజిల్(2.18లక్షలు), భారత్(1.53లక్షలు), మెక్సికో(1.5లక్షలు)లలో మాత్రమే లక్షకుపైగా మరణాలు నమోదయ్యాయి.
బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1లక్షా 162మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. బ్రిటన్‌లో రోజువారీ కేసుల్లో అది కనిపించటం లేదు. దేశంలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటడంపై ప్రధాని బోరిస్ జాన్సన్ విచారం వ్యక్తం చేశారు. ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి అన్న ఆయన.. వైరస్‌ను ఓడించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. కొవిడ్ మృతులను దేశం స్మరించుకుంటుందని, విపత్కర పరిస్థితులను తొలగించేందుకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ దేశంలో ఇప్పటివరకూ 36లక్షల 89వేల మంది కరోనా బారినపడ్డారు. వారిలో 16లక్షల 62 వేల మంది కరోనాను జయించారు.
- కరోనా కేసులపరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 2.60 కోట్ల మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 4.35లక్షల మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో మరో 63,626 కరోనా కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 8లక్షల 93వేలకు పెరిగింది. ఒక్కరోజులోనే 1,206 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 2.18లక్షలకు ఎగబాకింది.
- దక్షిణ కొరియాలో కొవిడ్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 554 మందికి వైరస్ సోకినట్టు తేలింది. గత పదిరోజుల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. ఆ దేశంలో ఇప్పటివరకు 76,429 కరోనా కేసులు బయటపడ్డాయి. వారిలో 1,378 మందిని కొవిడ్ బలితీసుకుంది.
కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న టాప్-5 దేశాలివే
దేశం | మొత్తం కేసులు | మరణాలు |
అమెరికా | 2,60,11,222 | 4,35,452 |
బ్రెజిల్ | 89,36,590 | 2,18,918 |
రష్యా | 37,56,931 | 70,482 |
బ్రిటన్ | 36,89,746 | 1,00,162 |
ఫ్రాన్స్ | 30,79,943 | 74,106 |
ఇదీ చదవండి:'టీకాల్లో వారికి ప్రాధాన్యం అవసరం లేదు'