కరోనా వైరస్ కారణంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. వైరస్ లక్షణాలు తగ్గకపోవడం కారణంగా ఆదివారమే ఆస్పత్రిలో చేరారు బోరిస్. తాజాగా ప్రధానిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించినట్లు డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం లండన్‌లోని సేయింట్ థామస్ ఆస్పత్రిలో ప్రధాని ఉన్నారు.
స్వీయ నిర్బంధం పూర్తయినా..
గతవారం బోరిస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినప్పటి నుంచి ఆయన స్వీయ నిర్బంధంలోనే ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ.. ఆయనలో ఇంకా వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో నిర్బంధాన్ని మరికొన్ని రోజులు పొడిగించుకున్నట్లు ప్రధాని స్వయంగా వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
మోదీ ప్రార్థనలు...
అంతకుముందు.. బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:ఇటలీలో మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య