పార్లమెంట్ నిలుపుదలపై బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్‌కు క్షమాపణలు తెలిపారు ప్రధాని బోరిస్ జాన్సన్ . పార్లమెంట్ నిలుపుదలపై ప్రధాని నిర్ణయాన్ని తప్పు పట్టింది బ్రిటన్ సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాణితో చరవాణిలో సంభాషించిన జాన్సన్ క్షమాపణలు తెలిపినట్లు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ప్రధాని తన నిర్ణయంపై ఎంత బాధపడుతున్నారో చెప్పేందుకు వీలైనంత త్వరగా రాణిని సంప్రదించారు అని పత్రిక కథనం పేర్కొంది.
బోరిస్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించడం రాణి, ప్రధాని మధ్య అపనమ్మకాలకు కారణమైందని వార్తలు వచ్చాయి.
"వర్ధమాన రాజకీయాల పట్ల రాజకుటుంబంలోని ఉన్నతస్థాయి వ్యక్తులు సానుకూలంగా లేరు."
-ఓ ప్రభుత్వ అధికారి వ్యాఖ్య
ప్రస్తుత రాజకీయాల పట్ల రాణి సలహాదారులు విసిగిపోయారని రాజకుటుంబ వర్గాలు వెల్లడించాయి.
మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ లాగానే బోరిస్ జాన్సన్ కూడా రాణి పట్ల విశ్వాసంతో లేరని రాజప్రాసాద అధికారి ఒకరు వెల్లడించారు. తన ప్రధాని పదవి జ్ఞాపకాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా ప్రోటోకాల్‌ను మరచి రాణితో సంభాషణ వివరాలను గతంలో బయటపెట్టారు కామెరాన్.
బ్రెగ్జిట్ సజావుగా జరగాలన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ను ఐదువారాల నిలుపుదల చేస్తూ సెప్టెంబర్ నెల ఆరంభంలో నిర్ణయం తీసుకున్నారు బోరిస్.
బ్రెగ్జిట్‌కు అక్టోబర్ 31 వరకు గడువు ఉన్నప్పటికీ పార్లమెంట్లో ఎదురయ్యే ప్రశ్నలు తప్పించుకునేందుకే నిలుపుదల చేశారని విపక్ష సభ్యులు, అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రధానిపై ఆరోపణలు సంధించారు.
పార్లమెంట్ నిలుపుదల చేయాలని ఎలిజబెత్ రాణికి ప్రధాని బోరిస్ ఇచ్చిన సూచన మేరకు.. ఆమె నిర్ణయం తీసుకోవడానికి ముందే సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది.
ఇదీ చూడండి: ఓవర్టేక్ చేసినందుకు ఆటోడ్రైవర్ హత్య!