జాతి వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమిస్తున్న అమెరికా వాసులు పట్టు సడలించడం లేదు. విధ్వంసాల జోలికి వెళ్లకుండా దేశవ్యాప్తంగా అనేకచోట్ల పెద్దఎత్తున ప్రదర్శనలు కొనసాగించారు. వాషింగ్టన్లో భారీ ర్యాలీ నిర్వహించారు నిరసనకారులు. చికాగో, అర్లింగ్టన్, వర్జీనియాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి.
ఫ్లాయిడ్‌కు నివాళిగా నార్త్ కరోలీనాలో సంతాప సభ నిర్వహించారు. పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో అమెరికన్ వ్యక్తి- జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.
మూడు ఖండాల్లో
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ జాతి విద్వేషానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు ప్రజలు. మొత్తం మూడు ఖండాల్లోని ప్రజలు జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఆస్ట్రేలియాలో వేలాది మంది నిరసనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిడ్నీలో దాదాపు వెయ్యి మందిని ప్రజలు టౌన్‌హాల్ ఎదుట ఆందోళన చేశారు. నిరసనకారులకు పోలీసులే స్వయంగా.. మాస్కులు, శానిటైజర్లు అందించారు. బ్రిస్బేన్‌లో 30 వేల మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
ఆసియా
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో నిరసనకారులు వరుసగా రెండో రోజు భారీ ప్రదర్శన చేపట్టారు. నిరసనలను అణచివేయడం మానుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐరోపా
ఐరోపాలోని పలు దేశాల్లోనూ ఆందోళనలు కొనసాగాయి. జర్మనీలో భారీ సంఖ్యలో ప్రజలు ఫ్లాయిడ్ నిరసనల్లో పాల్గొన్నారు. బెర్లిన్‌లోని అలెగ్జాండర్ స్క్వేర్ వద్ద 15 వేల మంది నిరసనకారులు ఆందోళన చేపట్టారు. నల్లదుస్తులు ధరించి జాతి విద్వేషానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఫ్రాన్స్‌లో ఆంక్షలను లెక్కచేయకుండా ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ముందు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ముందు ఆందోళన నిర్వహించారు.
ఇంగ్లండ్‌లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. లండన్‌లోని యూకే పార్లమెంట్ ఎదుట జరిగిన ఆందోళనలో పోలీసులకు నిరసనకారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టారు పోలీసులు.
జార్జి ఫ్లాయిడ్ మృతికి సంఘీభావంగా ఇటలీలో శాంతియుత ర్యాలీలు చేశారు. నేపుల్స్‌లోని అమెరికా కాన్సులేట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.