పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్26 ప్రపంచ వాతావారణ సదస్సులో ప్రసంగించారు.
"గ్లోబల్ వార్మింగ్‌ను ప్రపంచ దేశాలు కలిసి ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి తీవ్రమైన సవాళ్లలో ఇది ప్రధానమైంది. ఈ అంశంపై మనంలో మనం వాదించుకోవడానికి ఎక్కువ సమయంలేదు. ఈ పోరాటంలో వెనక్కి వెళ్లలేని పరిస్థితి నెలకొంది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఒక దశాబ్దపు ఆశయానికి గ్లాస్గో సదస్సు మంచి ప్రారంభం కావాలని బైడెన్ పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు మరింత సహాయం చేయాలనుకుంటున్నట్లు హామీ ఇచ్చారు. క్షీణిస్తున్న వనరులు, వాతావరణ మార్పుల వల్ల కలిగే సమస్యలను అరికట్టడానికి ఇదో మంచి అవకాశమని చెప్పారు.