కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Austria Lockdown) విధించింది ఆస్ట్రియా ప్రభుత్వం. సోమవారం నుంచి పది రోజుల పాటు అమలు కానుంది. వైరస్ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా పౌరులెవరు బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలను విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.
పలు ఆస్పత్రుల్లో కొవిడ్ బాధితులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు చేసిన హెచ్చరికతో కఠిన నిబంధనలు ఆస్ట్రియా అమలు చేస్తోంది. ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో ఆదివారం మార్కెట్లు కిక్కిరిసాయి. ప్రజలంతా కాఫీ షాపులకు, క్రిస్మస్ షాపింగ్ కోసం మార్కెట్లకు పోటెత్తారు.
క్షమించండి
టీకాలు తీసుకున్నవారికి క్షమాపణలు చెప్పారు ఆస్ట్రియా ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్. తాజాగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల వారు ఇబ్బందులు పడటం సరికాదన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని అరికట్టడమే (Austria Lockdown) తమ ఆలోచన అని స్పష్టం చేశారు షాలెన్‌బర్గ్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తామని వెల్లడించారు.
టీకాల పంపిణీలో వెనుకబడిన పలు ఐరోపా దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో ఐరోపాలోని పలు దేశాలు లాక్‌డౌన్ ఆంక్షలను విధిస్తున్నాయి.
ఇదీ చూడండి: కరోనా ఆంక్షలపై నిరసనలు హింసాత్మకం- నగరం లూటీ!