కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కఠిన ఆంక్షలు అమలు చేశాయి ప్రపంచ దేశాలు. వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్త లాక్డౌన్లు విధించాయి. సరిహద్దులు మూసివేశాయి. ప్రయాణాలు నిషేధించాయి. ఇప్పుడు మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈసారి కొత్త వ్యూహాలు రూపొందిస్తున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కాకుండా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న హాట్‌స్పాట్ కేంద్రాలకే ఆంక్షలను పరిమితం చేస్తున్నాయి. కొత్త కేసులు అధికంగా నమోదవుతున్న యూరప్, అమెరికా దేశాలు ఈ విధానాన్నే పాటిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఎంతటి తీవ్ర ప్రభావం ఉంటుందో తెలిశాక ఈ కొత్త వ్యూహాల రూపొందిస్తున్నాయి.
- అమెరికాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న న్యూయార్క్‌లోని హాట్‌స్పాట్ కేంద్రాలలో పాఠశాలలు, వ్యాపారాలు మూసివేశారు. చట్టుపక్కల రెండు చదరపు మైళ్ల వరకే ఆంక్షలను పరిమితం చేశారు.
- స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలు విధించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకే నిబంధలను పరిమితం చేశారు.
- ఇటలీలో పలు భవనాలను మాత్రమే క్వారంటైన్లో ఉంచారు.
- ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్ మాత్రం దేశవ్యాప్త లాక్డౌన్ విధించాయి. ఇతర దేశాలు మాత్రం టెస్టింగ్, ట్రేసింగ్‌తో పాటు పలు నగరాలకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నాయి.
- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ వ్యాప్తంగా రెండు వారాల పాటు లాక్డౌన్ విధించాలని నిపుణులు సూచించారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు విధానాల లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. కేసులు తీవ్రత ఆధారంగా ఆంక్షలు విధిస్తోంది.