ప్రపంచవ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ ప్రభావంతో కాలుష్య తీవ్రత తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు. 'ద గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్' సంస్థకు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేపట్టారు. కర్బన ఉద్గారాలు 7శాతం తగ్గాయని వెల్లడించారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 36.4 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ గాలిలోకి విడుదల కాగా 2020లో ఆ మొత్తం 34 బిలియన్ మెట్రిక్ టన్నులకే పరిమితమైందని 'ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా' అనే జర్నల్లో వివరించారు.
చైనాలో అలానే
కర్బన ఉద్గారాలు అమెరికాలో 12శాతం తగ్గాయి. ఐరోపాలో 11శాతం మేర తగ్గాయి. చైనాలో మాత్రం కేవలం 1.7శాతం మాత్రమే తగ్గాయి. చైనాలో కరోనా సెకండ్ వేవ్ లేనందువల్ల లాక్డౌన్ను వెంటనే తొలగించారు. మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో ఉద్గారాలు రవాణా మార్గం కంటే.. పరిశ్రమల నుంచే ఎక్కువ విడుదల అవుతాయి. దీంతో డ్రాగన్ దేశంలో కర్బన ఉద్గారాల విడుదల కొనసాగిందని సర్వేలో వెల్లడైంది. గత ఏడాదితో పోలిస్తే కాలుష్య తీవ్రత తగ్గినా..ప్రపంచంలో ఒక సెకనుకు సరాసరి 1,185 టన్నులు కార్బన్ డై ఆక్సైడ్ గాలిలోకి విడుదల అవుతుందని తేలింది.
తగ్గటానికి కారణం
లాక్డౌన్తో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా ప్రయాణాలు తగ్గాయని, అందుకే కర్బన ఉద్గారాలు తగ్గాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా సంక్షోభం తర్వాత కర్బన ఉద్గారాలు మళ్లీ పెరుగుతాయని స్టాన్ఫోర్డ్ వుడ్స్ పర్యావరణ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫీల్డ్ తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా సమాజంలో మార్పు వస్తే.. కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : దిల్లీలో 'టపాసుల విక్రయాల'పై నిషేధం గడువు పెంపు