పశ్చిమ పసిఫిక్ దేశాల్లో కరోనా వ్యాప్తి మరో దశకు చేరినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కాబట్టి ఆయా దేశాల ప్రభుత్వాలు త్వరగా మహమ్మారిని నియంత్రించేందుకు తగిన చికిత్సా విధానాలను చేపట్టాలని సూచించింది.
"కరోనా కేసుల్లో ఒకటికంటే ఎక్కువసార్లు పెరుగుదల నమోదవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు సుస్థిరమైన చర్యలు చేపట్టాలి" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పశ్చిమ పసిఫిక్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ తకేషి కసాయ్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చెందటం కంటే ముందుగా దానిని అరికట్టేందుకు ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరుచుకోవటం, మహమ్మారిని నియంత్రించగలిగే ఆరోగ్య విధానాలను అవలంబించాలని సూచించారు.
ఇలాంటి విధానాలతో మెరుగైన ఫలితాలు రావటమే కాకుండా.. సామాజిక అవరోధాలు తగ్గుతాయని, ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతోందని అన్నారు.
ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, జపాన్ దేశాల్లో 40 ఏళ్ల లోపు గల వారిపైనా వైరస్ ప్రభావం చూపుతున్నట్లు అందోళన వ్యక్తం చేశారు కసాయ్. చాలా మందిలో వైరస్ లక్షణాలు చాలా తక్కువ లేదా అసలు కనిపించటం లేదని... అలాంటి వారే మహమ్మారిని వ్యాప్తికి కారణం అవుతున్నారని వెల్లడించారు.