Ukraine s President Zelensky: రష్యన్ కళలు, సంస్కృతిని వ్యతిరేకించే ఉక్రెయిన్‌లో.. రష్యన్ భాష మాట్లాడే యూదు నటుడు అధ్యక్షుడు కావడం ఒక రకంగా విశేషమే. ఆగ్నేయ ఉక్రెయిన్‌లో రష్యా మాట్లాడే ప్రాంతంలో పుట్టిన వొలొదిమిర్ జెలెన్‌స్కీ.. కొన్నాళ్లు హాస్యనటుడిగా ఉండి, తర్వాత ఉన్నట్టుండి రాజకీయాల్లో ప్రవేశించి, నేరుగా అధ్యక్ష పదవిని చేపట్టారు! 1978 జనవరి 25న యూదు తల్లిదండ్రులకు జెలెన్‌స్కీ జన్మించారు. ఆయన తండ్రి సైబర్‌నెటిక్స్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. తల్లి కూడా ఇంజినీరే. ఆయన తాత సైమన్ ఇవనోవిచ్ జెలెన్‌స్కీ రెండో ప్రపంచయుద్ధ సమయంలో రష్యా సైన్యంలో పనిచేశారు. కీవ్ జాతీయ అర్థశాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన వొలొదిమిర్ జెలెన్‌స్కీ.. తర్వాత క్వర్తల్95 అనే సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ సినిమాలు, కార్టూన్లు, టీవీ షోలను నిర్మిస్తుంది. 'సర్వెంట్ ఆఫ్ ద పీపుల్' అనే టీవీ షోలో జెలెన్‌స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పాత్ర పోషించారు. 2018 మార్చిలో క్వర్తల్95 ఉద్యోగులు కొందరు కలిసి రాజకీయ పార్టీ స్థాపించారు. అదే సంవత్సరం డిసెంబరు 31 సాయంత్రం తాను అధ్యక్ష పదవికి పోటీ పడనున్నట్లు ప్రకటించిన జెలెన్‌స్కీ.. అప్పటికే సర్వేలలో ముందంజలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు రెండో రౌండు వచ్చేసరికే ఆయనకు 73.2% ఓట్లు వచ్చాయి.
సామాజిక మాధ్యమాల్లోనే..
ఈ-పాలనకు ఆయన గట్టి మద్దతుదారుడు. ఉక్రెయిన్, రష్యన్ భాషలు మాట్లాడే ప్రాంతాల మధ్య సమైక్యత తేవాలని భావించారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగానే తన అభిప్రాయాలు పంచుకుంటారు. ఆలిగార్క్‌ల అధికారాలను తీసేయడం ద్వారా తన బలం పెంచుకుంటున్నారని విమర్శకులు అంటారు. చాలాకాలంగా ఉక్రెయిన్-రష్యాల మధ్య విభేదాలను అంతం చేసేందుకు పుతిన్‌తో చర్చలకూ జెలెన్‌స్కీ శ్రీకారం చుట్టారు. కానీ, 2022 ఆరంభం నుంచే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు యుద్ధం ప్రారంభం కావడం ఆయనకు అగ్నిపరీక్షే. రష్యన్ కళాకారులను ఉక్రెయిన్ నుంచి బహిష్కరించాలన్న ఆ దేశ సాంస్కృతిక శాఖ నిర్ణయాన్ని 2014లో జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. కానీ, 2015లో రష్యా కళాకారులతోపాటు రష్యా కళారూపాలు కూడా ఉక్రెయిన్‌లో ఉండకూడదంటూ ప్రభుత్వం నిషేధించింది. ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న జెలెన్‌స్కీ తొలి ప్రధాన ప్రతిపాదనను ఉక్రెయిన్ పార్లమెంటు తిరస్కరించింది.
ఇదీ చూడండి: