16 కోట్ల మందికి వైరస్ సోకడం.. 34 లక్షల ప్రాణాలు గాల్లో కలవడానికి కొందరు శాస్త్రవేత్తలు చేసిన దుస్సాహస ప్రయోగాలే కారణమా..? వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ వేదికగా మారిందా..? వైరస్ పుట్టుకపై దర్యాప్తును వారే పక్కదోవ పట్టిస్తున్నారా..? అంటే సరైన సమాధానం దొరకదు. కానీ, పరిణామాలు.. దర్యాప్తులు తీరు ఆద్యంతం అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. మే 5న అణుశాస్త్రవేత్తల పత్రిక 'ది బులెటిన్.ఓఆర్‌జీ' ప్రచురించిన కథనం వూహాన్ ల్యాబ్‌పై అనుమానాలను పెంచేసింది. ఈ కథనాన్ని రాసిన నికోలస్ వేడ్ కేంబ్రిడ్జిలో నేచురల్ సైన్స్ డిగ్రీ చేశారు. 79 ఏళ్ల నికోలస్ గతంలో 'నేచర్', 'సైన్స్' వంటి పత్రికలకు ఎడిటర్‌గా చేశారు. వైరస్ పుట్టుకపై దర్యాప్తు చేయాలనే ఒత్తిడి ప్రజల వైపు నుంచి రానీయకుండా కొందరు శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు పేర్కొన్నారు. దీనిలో అమెరికా, చైనా శాస్త్రవేత్తల పాత్ర ఉందంటున్నారు వేడ్. ఆయన కథనంలోని కీలక అంశాలు..
ఎవరీ పీటర్.. ?
చైనాలో తొలుత కొవిడ్ వ్యాప్తిని గుర్తించినప్పుడు అక్కడి అధికారులు అది ఎక్కడి నుంచి పుట్టిందో వెల్లడించలేదు. ఆ తర్వాత వూహాన్ మార్కెట్ అంశం తెరపైకి వచ్చింది. అంతేకాదు సార్స్, మెర్స్ వ్యాపించినప్పుడు కరోనా వైరస్ గబ్బిలం నుంచి సివిట్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి మనిషిలోకి చేరి సార్స్ వ్యాధిని పుట్టించింది. ఇక గబ్బిలం నుంచి ఒంటెలోకి చేరిన వైరస్‌తో మెర్స్ వ్యాధి పుట్టింది. కానీ, సార్స్‌కోవ్-2లో మాత్రం అది గబ్బిలం నుంచి ఏ జీవిలోకి ప్రవేశించిందో కనుగొనలేదు. దీంతో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి లీకైందన్న ప్రచారం ఊపందుకోవడంతో కొందరు వైరాలజిస్టుల బృందం లాన్సెట్‌లో ఓ లేఖను రాసి ఈ వాదనను ఖండించింది. "కొవిడ్-19 సహజమైనది కాదనే ప్రచారాలను సమష్టిగా ఖండిస్తున్నాం. అది పూర్తిగా అడవి జంతువుల నుంచి వచ్చింది. చైనా సహచరులకు మద్దతుగా ఉండాలి" అని పేర్కొన్నారు. ఈ లేఖ వల్ల తమకు ఎటువంటి ప్రయోజనాలు లేవని కూడా పేర్కొన్నారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా.. ఒక వాదనను శాస్త్రవేత్తలు ఎలా తోసిపుచ్చుతారని వేడ్ ప్రశ్నించారు.
వాస్తవానికి న్యూయార్క్‌లోని ది ఎకోహెల్త్ అలయన్స్ సంస్థ అధ్యక్షుడు, వైరాలజిస్టు పీటర్ డెస్జాక్ ఈ లేఖకు సంబంధించి ఆర్గనైజింగ్, డ్రాఫ్టింగ్ బాధ్యతలు చూశాడు. అదే పీటర్‌కు చెందిన సంస్థ వూహాన్ ఇన్‌స్టిట్యూట్‌కు కరోనా వైరస్‌లపై పరిశోధనలకు నిధులను సమకూర్చింది..! ఈ విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించలేదు. నైతికంగా ఇది తప్పు అని వేడ్ విమర్శించారు.
ఇదీ చదవండి: కరోనా వైరస్‌తో ఆయుధాలు- 2015లోనే చైనా చర్చ!
యునాన్ ప్రావిన్స్‌లో 2012లోనే..
యునాన్ ప్రావిన్స్‌లో గుహల్లో ఏప్రిల్ 2012లో ఆరుగురు కార్మికులు పనిచేస్తూ జబ్బున పడ్డారు. వీరు జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు మరణించారు. మిగిలిన వారు నెలల కొద్దీ ఆసుపత్రి పాలయ్యారు. బతికిన వారిలో సార్స్ రోగుల్లో వచ్చే యాంటీబాడీలు కనిపించాయి. దీంతో ఈ విషయం బ్యాట్ ఉమెన్‌గా పేరున్న వూహాన్ ల్యాబ్ శాస్త్రవేత్త షీజెంగ్ లీకి తెలిసింది. ఆమె బాధితుల, గుహల గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించింది. వీటిని వుహాన్ ల్యాబ్‌లో విశ్లేషించి ఆర్‌ఏటీజీ13 వైరస్‌గా గుర్తించారు. ఈ వైరస్ జన్యువులు నేటి సార్స్‌కోవ్-2 జన్యువులతో చాలా మటుకు సరిపోతున్నాయి. షీజెంగ్‌లీ ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన రాల్ఫ్ ఎస్ బెరిక్‌తో కలిసి కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేశారు. సార్స్1 జన్యువులతో వీరు 2015లో కొత్త వైరస్‌ను సృష్టించినట్లు వేడ్ కథనంలో పేర్కొన్నారు. ఇది మనుషుల శ్వాస వ్యవస్థను సోకగలదు. ది ఎకోహెల్త్ అలయన్స్ అధిపతి పీటర్ డెస్జాక్ 2019 డిసెంబర్ రెండో వారంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టఏడేళ్లు కష్టపడి చేసిన ప్రయోగాల్లో 100 వరకు కొత్త రకం వైరస్‌లను అభివృద్ధి చేశాంట అని వెల్లడించిన మాటలను వేడ్ తన కథనంలో ఉటంకించారు.
'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' పరిశోధనలపై అనుమానాలు..
పీటర్ డెస్జాక్ సమకూర్చిన నిధులతో వుహాన్ ల్యాబ్‌లో 'గెయిన్ ఆఫ్ ఫంక్షన్' పరిశోధనలు అవుతున్నాయని నమ్ముతున్నారు. అన్ని రకాల వైరస్‌లు మనుషులకు సోకవు. కానీ, వాటిల్లో మార్పులు జరిగితే (మ్యూటేషన్లు) మనుషలకు సోకే ప్రమాదం ఉంది. అందుకే మనుషులకు సోకే ప్రమాదం ఉన్న వైరస్‌లను గుర్తించి వాటిల్లో మార్పులు చేసి పరిశీలిస్తారు. ఈ క్రమంలో అవి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇటువంటి ప్రయోగాలను అమెరికాలో 2014లో నిషేధించారు. కానీ, ట్రంప్ వచ్చాక మళ్లీ వీటికి అనుమతులు పునరుద్ధరించారు. ఆ సమయంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఐఏఐడీ నుంచి వూహాన్ ల్యాబ్‌కు నిధులు అందాయి. దీని డైరెక్టర్ ఆంటోనీ ఫౌచీ మాత్రం తాము నిధులు ఇవ్వలేదని ఇటీవల విచారణంలో వెల్లడించారు. కానీ, ది ఎకోహెల్త్ అలయన్స్‌కు నిధులు సమకూర్చినట్లు అంగీకరించారు. అయితే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ ప్రయోగాల కోసం కాదని తేల్చిచెప్పారు.
వుహాన్ ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగాలు..
పలు దేశాల్లో గెయిన్ ఆఫ్ ఫంక్షన్స్ ప్రయోగాలపై నిషేధం ఉన్నా.. చైనాలో అటువంటివి లేవు. అక్కడ ఉన్న వూహాన్ ల్యాబ్‌లో దీనిపై ప్రయోగాలు జరుగుతుంటాయి. వాస్తవానికి ఇటువంటి ప్రయోగాలకు బీఎస్‌ఎల్4 ల్యాబ్ ఉండాలి. చాలా జాగ్రత్తలతో ఈ ప్రయోగాలు చేస్తారు. ఇక్కడ మనుషులకు సోకే కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడి బీఎస్‌ఎల్-2 స్థాయి పరిస్థితుల్లోనే ప్రయోగాలు చేసినట్లు వేడ్ పేర్కొన్నారు.
కరోనా లీకేజీ విమర్శలు వచ్చాక.. ల్యాబ్ రికార్డులను చైనా అధీనంలోకి తీసుకోవడం.. బయట ప్రపంచానికి చెప్పకపోవడంతో అనుమానాలను పెంచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా చెప్పిన సమాచారాన్నే ప్రపంచంపై రుద్దడం వంటి అంశాలు కరోనా పుట్టుకపై అనుమానాలు పెంచుతున్నాయి. జనవరిలో చైనాకు వెళ్లిన దర్యాప్తు బృందాన్ని కూడా బాగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వేడ్ రాసిన కథనంతో మరోసారి చైనా కుట్ర కోణం వార్తల్లోకి ఎక్కింది.
ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్ఓకు చుక్కలు చూపించిన చైనా