కరోనా కేసులు పెరుగుతున్న వేళ వియత్నాం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అతిపెద్ద నగరమైన 'హో చి మిన్'లోని 90 లక్షల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. అత్యవసరాలకు మినహా ఇంటి నుంచి బయటకు రాకుండా నిషేధం విధించింది. బహిరంగ ప్రదేశాల్లో 10 మందికి మించి గుమిగూడవద్దని స్పష్టం చేసింది.
కొవిడ్ నేపథ్యంలో అత్యవసరం కాని వ్యాపారాలు నగరంలో గురువారమే నిలిచిపోయాయి. రోజుకు లక్ష పరీక్షల లెక్కన.. నగరంలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ చివరి వారం నుంచి వియత్నాంలోని 31 మున్సిపాలిటీలలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కాలంలో 4 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఏడు వేల కేసుల్లో అధిక భాగం గత కొద్దివారాల్లోనే నమోదు కావడం గమనార్హం.
చైనా అలర్ట్!
కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. ఈ రాష్ట్రం నుంచి బయటకు వచ్చేవారు తప్పక కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ట్రక్కు డ్రైవర్ల కోసం ప్రధాన రహదారులలో టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
హాంకాంగ్ సమీపంలో ఉండే ఈ రాష్ట్రంలో ఆదివారం 20 కేసులు బయటపడ్డాయి. దీంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. శనివారం గౌంగ్ఝౌ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేసి.. ఇంటింటికి వెళ్లి కరోనా టెస్టులు చేశారు. పలు ప్రాంతాల్లో మార్కెట్లు, చైల్డ్ కేర్ సెంటర్లు మూసేశారు.
ఇదీ చదవండి- myanmar: మయన్మార్ నిరసనల్లో 840 మంది మృతి