అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతుంటే చైనా పక్కనే ఉన్న వియత్నాం మాత్రం కరోనాను విజయవంతంగా కట్టడి చేయగలిగింది. ఇక్కడ కేసులు ఇప్పటికీ వందల్లోనే ఉండటం గమనార్హం. మృతుల సంఖ్య దాదాపు సున్నా అని వియత్నాం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ చిన్నదేశం కరోనాను ఎలా కట్టడి చేసింది?
చైనా కంటే ముందే మేల్కొని..
చైనాలోని వుహాన్‌లో 2019 చివరి నాళ్లలో కరోనా మహమ్మారి వెలుగుచూసింది. దీనిపై చైనా పూర్తిగా అధ్యయనం చేయకముందే వియత్నాం ఈ ప్రమాదాన్ని ఊహించింది. వెంటనే నూతన సంవత్సరంలో కట్టడి చర్యలు ప్రారంభించింది. వియత్నాం అధికార కమ్యూనిస్టు పార్టీ పెద్దలు కరోనా తమ దేశంలో వ్యాపిస్తే వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్న పరిస్థితుల్లో ఎదుర్కోవడం కష్టమని అంచనా వేశారు. వెంటనే చైనాతో ఉన్న సరిహద్దును దాదాపుగా మూసివేశారు. చైనాలోని లాక్‌డౌన్ జనవరి 20 తర్వాత ప్రారంభం కాగా వియత్నాంలో జనవరి 1 నుంచే పలు ప్రాంతాల్లో అమలు చేశారు.
శోధించారు.. పట్టుకున్నారు.. తరలించారు..
వియత్నాంలో వైద్య సిబ్బంది, నిధులు చాలా తక్కువ. రాజధాని నగరం హోచిమిన్ సిటీలో ఐసీయూ పడకల సంఖ్య వేయిలోపే. ఈ నగర జనాభా 8 మిలియన్లు. దీంతో మొదటగా వ్యాధిగ్రస్తులను గుర్తించడం ప్రారంభించారు. వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో తెలుసుకొని వారిని కూడా కనుగొని పరీక్షలు నిర్వహించారు. ఇది ఒక ఉద్యమంలా సాగింది. వియత్నాం సమాజంలో అధికార కమ్యూనిస్టు పార్టీ సభ్యుల పాత్ర చాలా కీలకం. వీరు నిఘా వ్యవహారాలు సైతం నిర్వహించి బాధితులను కనుగొనడంలో కీలకపాత్ర పోషించారు.
విజయవంతంగా లాక్‌డౌన్
దేశంలో అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. మూడు వారాలు, నాలుగు వారాలు లాక్‌డౌన్ పాటించారు. కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో ఆ వ్యవధి అనంతరం లాక్‌డౌన్ ఎత్తివేశారు. అయితే, నిఘా మాత్రం కొనసాగేది. కరోనా బాధితులు తిరిగిన రూట్‌ను కలుసుకున్న వారిని నాలుగు అంచెలుగా విభజించి అందరికి పరీక్షలు నిర్వహించడంతో పాటు గృహ నిర్భంధం విధించారు. అవసరమైతే క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
ఇంటిలో ఉంటే దేశానికి సేవ చేసినట్టే..
ప్రజలు ఇంటిలో ఉంటే దేశానికి సేవచేసినట్టేనని ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో పాటు శానిటైజర్లు, మాస్క్‌లను విరివిగా సరఫరా చేసింది. ఈ లాక్‌డౌన్‌లో అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలచిపోవడం దేశ ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వం అనేక ఉద్దీపన పథకాలను ప్రకటించింది. చైనాకు దూరంగా వేలమైళ్ల దూరంలో ఉన్న దేశాలు సైతం కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతుంటే పక్కనే ఉన్న వియత్నాం మాత్రం ముందు చూపుతో కట్టడి చేయగలిగింది. ఇప్పటికీ వియత్నాంలో పాజిటివ్ కేసుల సంఖ్య 200 కూడా దాటలేదు. మరణాలు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి:వారి కోసం ప్రత్యేకంగా 1000 ఆర్టీసీ బస్సులు